రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
కోట్‌పల్లి మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి
21 మంది లబ్ధిదారులకు రూ.21.02 లక్షల కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
తాండూర్అక్టోబర్ 14 ( తెలంగాణ వార్త ప్రతినిధి) రైతు సంక్షేమమే ప్రధాన ఎజెండగా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుందని రైతు పక్షపాతిగా సీఎం రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం పనిచేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సూచించారు కోట్‌పల్లి మండల కేంద్రంలోని డీఎంఆర్ ఫంక్షన్ హాల్లో బుధవారం కోట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.
మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా అనిత రమేష్ నాయక్, వైస్ చైర్మన్‌గా మధులత శ్రీనివాస్ చారితో పాటు నూతన పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నూతనంగా బాధ్యతలు చేపట్టిన చైర్పర్సన్, వైస్ చైర్మన్‌తో పాటు పాలకవర్గ సభ్యులందరూ రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారి సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాలన్నారు. రైతుల అభ్యున్నతికి ప్రాధాన్యతనిస్తూ మార్కెట్ కమిటీ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని సూచించారు.
రైతులకు నమ్మకమైన సేవలు అందించి మార్కెట్ కమిటీకి మంచి పేరు తీసుకురావడంతో పాటు ప్రజల విశ్వాసాన్ని పొందాలని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేస్తూ, రైతులకు ఎల్లప్పుడూ అండగా నిలవాలని నూతన పాలకవర్గానికి సూచించారు.
లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
అనంతరం ఎమ్మెల్యే బీఎంఆర్ 21 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.21,02,436 విలువైన కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అలాగే అర్హులైన లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డులను అందజేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
