గ్రామ పంచాయతీల లెక్క తేల్చే మేరీ పంచాయత్ యాప్
రూపాయి ఖర్చుతో సహా ప్రజా క్షేత్రంలోకి.. పారదర్శక పాలనే లక్ష్యంగా కేంద్రం చర్యలు
తాండూర్ అక్టోబర్ 14 (తెలంగాణ వార్తా ప్రతినిధి )
గ్రామ పంచాయతీల పాలనలో పారదర్శకతను పెంచుతూ, ప్రజలను భాగస్వాములను చేసేందుకు భారత ప్రభుత్వ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ‘మేరీ పంచాయత్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రతి పైసా ఖర్చుకు స్పష్టమైన ఆధారాలు ఉంచుతూ, సామాన్య పౌరులకు గ్రామ నిధుల వివరాలు, అభివృద్ధి పనుల సమాచారాన్ని ఈ యాప్ ద్వారా చేరవేస్తోంది.
ల్యాప్‌టాప్, మొబైల్లోనే సమగ్ర సమాచారం
వినియోగదారులు తమ పేరు, మొబైల్ నంబర్ నమోదు చేసి ఓటీపీ వెరిఫికేషన్ ద్వారా రిజిస్టర్ కావచ్చు. పిన్ నంబర్ సెట్ చేసుకున్న తర్వాత, తమ గ్రామాన్ని ఎంచుకుంటే చాలు—సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి వివరాల నుంచి నిధుల జమ, ఖర్చుల వరకు ప్రతీదీ తెలుగు భాషలోనే వేలిముద్రపై ప్రత్యక్షమవుతాయి.
ఖాతాలో నిల్వలు…. ప్రస్తుతం పంచాయతీ ఖాతాలో ఎంత నగదు అందుబాటులో ఉందో క్షణాల్లో తెలుసుకోవచ్చు.నిధుల రాక: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద గ్రామానికి వచ్చిన మొత్తం గ్రాంట్లుఖర్చుల పర్యవేక్షణ: రోడ్లు, వీధిదీపాలు, డ్రైనేజీ నిర్మాణం వంటి పనుల కోసం ఆర్థిక సంవత్సరాల వారీగా, తేదీలతో సహా చేసిన వ్యయం
జియో-ట్యాగింగ్‌తో అవినీతికి చెక్! ఈ యాప్ కేవలం సమాచారానికే పరిమితం కాకుండా చట్టబద్ధమైన బాధ్యతను కూడా పెంచుతుంది. అభివృద్ధి పనుల నాణ్యతలో లోపాలు ఉంటే, భౌగోళిక గుర్తింపు కలిగిన ఫొటోలను తీసి నేరుగా యాప్ ద్వారా ఫిర్యాదు చేసే సౌలభ్యం కల్పించారు.పక్కా డిజిటల్ సాక్ష్యం:
నిధుల కేటాయింపు నుంచి పని పూర్తయ్యే వరకు ప్రతి దశ డిజిటల్ రూపంలో శాశ్వతంగా నమోదవుతుంది. ఇది భవిష్యత్తులో జరిగే ఆడిటింగ్‌కు పక్కా సాక్ష్యంగా నిలవడంతో పాటు, అధికారుల్లో జవాబుదారీతనాన్ని పెంచుతుంది.
ఫిర్యాదులతో తక్షణ చర్యలు
గ్రామంలో ఎదురయ్యే సమస్యలపై నేరుగా ఈ యాప్ ద్వారా అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. పనుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బంది, అధికారులపై చట్టబద్ధమైన చర్యలు తీసుకునేలా ఈ వ్యవస్థను రూపుదిద్దినట్లు అధికారులు వెల్లడించారు. ఈ డిజిటల్ విప్లవం ద్వారా గ్రామ స్వరాజ్య లక్ష్యం నెరవేరుతుందని భావిస్తున్నారు.
