–జుంటుపల్లి ఆయకట్టుకు జలకళ.. రూ.5.71 కోట్లతో కాల్వల ఆధునీకరణకు శ్రీకారం!
రైతుల ముఖాల్లో ఆనందం.. పొలాల్లో పచ్చదనం నింపడమే నా లక్ష్యం!
చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తాం.. తాండూరు ఎమ్మెల్యే బి మనోహర్ రెడ్డి
తాండూరు, అక్టోబర్ 14 ( తెలంగాణ వార్త ప్రతినిధి): రైతుల ముఖాల్లో ఆనందం చూడటం.. పొలాల్లో పచ్చదనం నింపడమే తన లక్ష్యమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి (బీఎంఆర్) అన్నారు. రైతులకు సాగునీటి కష్టాలు లేకుండా చేసి, చివరి ఆయకట్టు వరకు నీటిని అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. యాలాల మండలంలోని జుంటుపల్లి ప్రాజెక్టు ఎడమ, కుడి కాల్వల ఆధునీకరణ పనులకు రూ.5.71 కోట్ల నిధులతో బుధవారం ఆయన శంకుస్థాపన చేశారుఈ సందర్భంగా ఎమ్మెల్యే బీఎంఆర్ మాట్లాడుతూ.. గత పాలకులు జుంటుపల్లి ప్రాజెక్టు కాల్వల పునరుద్ధరణ పనులపై దృష్టి సారించలేదని, రైతులకు సాగునీరు అందించాలనే ఆలోచన కూడా చేయలేదని విమర్శించారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా సాగునీటి రంగానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. జుంటుపల్లి ప్రాజెక్టు కాల్వల ఆధునీకరణతో సాగునీటి వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని, నీటి వృథా తగ్గి ఆయకట్టు రైతులకు ప్రయోజనం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కోట్పల్లి ప్రాజెక్టు పనులు తుది దశలో..
నియోజకవర్గంలో సాగునీటి వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కోట్పల్లి ప్రాజెక్టు పనులను దాదాపు రూ.100 కోట్లతో ప్రారంభించామని, ప్రస్తుతం ఆ పనులు తుది దశకు చేరుకున్నాయని వెల్లడించారు. తాజాగా జుంటుపల్లి ప్రాజెక్టు కాల్వల ఆధునీకరణకు రూ.5.71 కోట్లతో పనులు ప్రారంభించినట్లు తెలిపారు.
రైతుల అవసరాలకు అనుగుణంగా సాగునీటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని, వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జుంటుపల్లి ప్రాజెక్టు పనుల పూర్తి కోసం అవసరమైతే మరిన్ని నిధులు తీసుకొచ్చి, ఆయకట్టు రైతులందరికీ సాగునీరు అందేలా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధారాసింగ్, కర్ణం పురుషోత్తం రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, పిఎసిఎస్సి చైర్మన్ యాలాల మార్కెట్ కమిటీ చైర్మన్ అనిల్ కుమార్ ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
