తాండూరు, అక్టోబర్ 31 (తెలంగాణ వార్త ప్రతినిధి) :-గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రతి ఒక్కరూ సమన్వయంతో, పట్టుదలతో పనిచేయాలని ఎన్నికల తాండూరు సమన్వయకర్త విప్లవ్ కుమార్ సూచించారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడిని నేరుగా కలిసి ఓటరుగా నమోదు చేయించాలని, ఒక్క అర్హుడి ఓటు కూడా నమోదు కాకుండా మిగిలిపోకూడదని స్పష్టం చేశారు.హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియపై శనివారం తాండూరు బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. తాండూరు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి శ్రీశైల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నియోజకవర్గవ్యాప్తంగా నియమితులైన 222 మంది ఇన్చార్జులు, మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, పార్టీ ముఖ్య నాయకులు, కౌన్సిలర్లు, మహిళా నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా విప్లవ్ కుమార్ ప్రతి ఇన్చార్జితో ఓటరు నమోదు పురోగతిని, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి పలు సూచనలు చేశారు. ప్రతి మండలంలో నమోదైన ఓట్ల వివరాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని తెలిపారు. సాధారణ ఎన్నికలకు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించి నమోదు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పట్టభద్రులను నేరుగా కలిసి ఇప్పటికే నమోదు చేసుకున్నారా లేదా తెలుసుకోవాలని, నమోదు కానివారితో వెంటనే దరఖాస్తు చేయించాలని కోరారు. పార్టీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.శ్రీశైల్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి పట్టభద్రుడు తన ఓటు హక్కును వినియోగించుకునేలా ముందుగా ఓటరుగా నమోదు చేసుకోవాలని అన్నారు. నాయకులు తమ కుటుంబ సభ్యులు, బంధువులు, పరిచయస్తుల్లోని అర్హులైన పట్టభద్రులందరికీ నమోదు చేయించాలని సూచించారు. గతంలో ఓటరుగా నమోదైన వారు సైతం ఈసారి కొత్తగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని స్పష్టంగా వివరించాలని తెలిపారు.ఆన్లైన్లో స్వయంగా నమోదు చేసుకునే అవకాశం ఉందని, సమయం లేక ఇబ్బందులు పడుతున్న పట్టభద్రుల వద్దకే వెళ్లి తమ బృందం సహకారంతో నమోదు ప్రక్రియ పూర్తి చేయించాలని ఇన్చార్జులకు సూచించారు. ఓటరు నమోదు గడువు మరో వారం రోజులు మాత్రమే ఉండటంతో ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో మరింత చురుగ్గా పనిచేసి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో తాండూరు మండల పార్టీ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, రాజప్ప గౌడ్, నరుకుల నరేందర్ గౌడ్, నరసింహారెడ్డి, కోయూర్ శ్రీనివాస్, సిద్ధిరాల శ్రీనివాస్‌తో పాటు బషీరాబాద్, పెద్దేముల్, యాలాల్, తాండూరు మండలాల, పట్టణ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వారం రోజులే గడువు.. ఓటరు నమోదుపై వేగం పెంచండి!
