ఫిన్లాండ్ విద్యా యాత్రకు తాండూరు ప్రిన్సిపల్ శ్రీదేవి ఎంపిక
బోధన, పరిపాలనలో 30 ఏళ్ల అనుభవం.. డిజిటల్ విద్యలోనూ అద్భుత ప్రతిభ
తాండూరు, అక్టోబర్ 23:- (తెలంగాణ వార్త ప్రతినిధి)
అంతర్జాతీయ విద్యా ప్రమాణాలను అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఫిన్లాండ్ విద్యా యాత్రకు తాండూరులోని ( పి ఎం షైరి ) తెలంగాణ మోడల్ స్కూల్ జినుగుర్తి ప్రిన్సిపల్ శ్రీదేవి ఎంపికయ్యారు. అక్టోబర్ 25 నుంచి 31 వరకు కొనసాగనున్న ఈ యాత్రకు ఆమె ఎంపిక కావడం విద్యారంగంలో విశేష గుర్తింపు పొందింది.
బోధన, పరిపాలనా రంగాల్లో మూడు దశాబ్దాల అనుభవం కలిగిన శ్రీదేవి.. రసాయన శాస్త్రంలో ఎస్వీ యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ సాధించారు. ప్రస్తుతం ప్రిన్సిపల్ బాధ్యతలతో పాటు కెమిస్ట్రీ బోధిస్తూ విద్యార్థుల విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తూ, వారిని ఉన్నత లక్ష్యాల దిశగా నడిపించే మోటివేటర్‌గా గుర్తింపు పొందారు.
డిజిటల్ విద్యలోనూ ప్రత్యేక ముద్ర
పాఠశాలలో సుమారు 660 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా, మెరుగైన విద్యా ప్రమాణాలు, కళాశాల ఫలితాల సాధనకు ఆమె ప్రాధాన్యమిస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని బోధనలో వినియోగిస్తూ ఖాన్ అకాడమీ ప్లాట్‌ఫారమ్‌లో 100 శాతం యాక్టివేషన్ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఫిజిక్స్ వాలా ప్లాట్‌ఫారమ్ లీడర్‌బోర్డులో ప్రథమ స్థానం సాధించడం పాఠశాల డిజిటల్ విద్యా చొరవలకు నిదర్శనంగా నిలుస్తోంది.
విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని బోధనతో పాటు నైపుణ్యాభివృద్ధి, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఆమె నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రస్థాయి JET ఇన్నోవేషన్ అవార్డుతో పాటు పలు అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు.
ఫిన్లాండ్ విద్యా విధానాలు, బోధనా పద్ధతులు, విద్యార్థి కేంద్రిత అభ్యసన విధానాలను అధ్యయనం చేసే అవకాశం ఆమెకు లభించనుంది. ఈ యాత్ర ద్వారా పొందే అనుభవాలు భవిష్యత్తులో పాఠశాల విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు దోహదపడతాయని విద్యావర్గాలు ఆశిస్తున్నాయి. శ్రీదేవి ఎంపిక పట్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు
