తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం – చేయూత పథకంలో కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్..!

తెలంగాణ వార్త (8 ఆగస్ట్ 2026):రాష్ట్రంలో చేయూత పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఒంటరి మహిళలు, వితంతువులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, పైరేరియా (బోధకాలు) బాధితులు, డయాలసిస్ రోగులు, దివ్యాంగులు, సికిల్ సెల్, హీమోఫీలియా బాధితులకు ప్రాధాన్యత క్రమంలో పింఛన్లు మంజూరు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

దరఖాస్తుల స్వీకరణకు ఎలాంటి చివరి తేదీ లేదని, నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అర్హతలు ఇవే…

గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు ఉన్నవారు పింఛన్లకు అర్హులు. అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు, మూడు ఎకరాల కంటే ఎక్కువ మాగాణి భూమి, 7.5 ఎకరాల కంటే ఎక్కువ మెట్ట భూమి ఉన్నవారు అనర్హులుగా పరిగణిస్తారు.

ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు, అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, డాక్టర్లు, కాంట్రాక్టర్లు, వృత్తి నిపుణులు, ఆయిల్ మిల్లులు, రైస్ మిల్లులు, పెట్రోల్ బంకులు నిర్వహించే వారు అనర్హులు.

ఇప్పటికే ప్రభుత్వ లేదా స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ పొందుతున్నవారు, నాలుగు చక్రాల వాహనాలు లేదా భారీ వాహనాలు కలిగి ఉన్నవారిని కూడా అనర్హులుగా గుర్తించనున్నారు.

దరఖాస్తు విధానం…

గతంలో దరఖాస్తు చేసిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే తమ దరఖాస్తు వివరాలు అందుబాటులో ఉన్నాయో లేదో పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారుల ద్వారా ధ్రువీకరించుకోవాలి.

కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు చేయూత వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకుని, పూర్తి చేసిన అనంతరం గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులకు లేదా మండల ప్రజాపరిషత్ కార్యాలయాల్లో సమర్పించాలి.

పట్టణ ప్రాంతాల్లో బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులు లేదా పురపాలక కమిషనర్‌కు దరఖాస్తులు అందజేయాలి.