తాండూరు మండల స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి..!

తాండూరు ( తెలంగాణ  వార్త) : ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి  అన్నారు.

తాండూరు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొని గ్రామాల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌లను ఎమ్మెల్యే సన్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలను వేగవంతం చేయాలని, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు, సర్పంచ్‌లకు సూచించారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.

ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో సుధీర్, స్పెషల్ ఆఫీసర్ సత్తర్, ఎంపీడీవో విశ్వప్రసాద్, డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్, ఏఎంసీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, అన్ని గ్రామాల సర్పంచ్‌లు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.