తాండూరు ( 11th ఆగస్ట్ 2026) : తాండూరు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్ కార్యక్రమంలో ఆయన పలు కీలక అంశాలపై మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాండూరు నియోజకవర్గంలో SIR (Special Intensive Revision) ప్రక్రియ 100 శాతం పూర్తయిందని, ఈ ప్రక్రియలో దాదాపు 65 వేల ఓట్లు తొలగించబడ్డాయని తెలిపారు. పట్టణ ప్రాంతాల నుంచి పలువురు తమ స్వగ్రామాలకు ఓట్లు మార్చుకున్నారని, దీని ప్రభావం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కనిపించే అవకాశం ఉందన్నారు.
తాండూరు నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి అంశాలపై అత్యధికంగా మాట్లాడిన ఎమ్మెల్యేలలో తానే ముందున్నానని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.
వైద్య రంగ అభివృద్ధిపై మాట్లాడుతూ.. జిల్లా ఆస్పత్రిలో ఆధునిక వసతులు, అవసరమైన వైద్య పరికరాలు, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
తాగునీరు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి:
తాండూరు పట్టణంలో మురుగునీటి శుద్ధి కేంద్రాలు (STP) నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, త్వరలో కాగ్నా నది నుంచి తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు.
యువతకు ఉపాధి అవకాశాలపై స్పందిస్తూ..
నిరుద్యోగ యువత కోసం తాండూరు పట్టణంలో SI, కానిస్టేబుల్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తానని తెలిపారు. గతంలో పరిగిలో కూడా ఇలాంటి కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు.
రోడ్ల అభివృద్ధిపై మాట్లాడుతూ..
నియోజకవర్గంలో ఇప్పటికే 60 శాతం రోడ్ల పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను కూడా వేగంగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. ఎన్నికలకు సంవత్సరం ముందుగానే నియోజకవర్గంలోని రోడ్ల పనులు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
అక్రమ ఇసుక రవాణాను అరికడతామని, అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోమని స్పష్టం చేశారు. మున్సిపల్ స్థలాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశిస్తామని చెప్పారు.
దేశ రాజకీయాలపై స్పందించిన ఎమ్మెల్యే.. రాబోయే రోజుల్లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాదని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో జెన్‌జెడ్ యువత ప్రభావం పెరుగుతోందని అన్నారు.
ఇటీవల ATCలో మంచి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే అభినందించారు.
