బీఆర్‌ఎస్‌లో క్రమశిక్షణకు తూట్లు.. సస్పెండ్ చేసిన నేతకు ఘన స్వాగతమా.? కాంగ్రెస్‌ నేత కావలి సంతోష్‌ కుమార్ ఫైర్..!  

తాండూరు ( ఆగస్ట్ 17th 2026 ): బీఆర్‌ఎస్‌ అధిష్టానం సస్పెన్షన్‌కు గురిచేసిన మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డికి తాండూరులో అదే పార్టీ నాయకులు గజమాలతో ఘన స్వాగతం పలకడంపై కాంగ్రెస్‌ పార్టీ వికారాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్‌ కుమార్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

పార్టీ అధిష్టానం ఒకవైపు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెన్షన్‌ నిర్ణయం తీసుకుంటే.. మరోవైపు అదే పార్టీకి చెందిన స్థానిక నాయకులు ఘన సన్మానాలు, స్వాగతాలతో కార్యక్రమాలు నిర్వహించడం బీఆర్‌ఎస్‌ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోందని అన్నారు.

ఈ సందర్భంగా కావలి సంతోష్‌ కుమార్ మాట్లాడుతూ.. “అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి విలువ ఇవ్వకుండా స్థానిక నాయకులు వ్యవహరించడం బీఆర్‌ఎస్‌లో క్రమశిక్షణ పూర్తిగా క్షీణించిందని స్పష్టం చేస్తోంది. పార్టీ నిర్ణయాలను గౌరవించలేని నాయకులు ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారు?” అని ప్రశ్నించారు.

డ్రగ్స్‌ వివాదం నేపథ్యంలో పైలట్‌ రోహిత్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు బీఆర్‌ఎస్‌ నాయకులే ప్రకటించారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తికి అదే పార్టీ నేతలు గజమాలలు వేసి ఘన స్వాగతం పలకడం ఏ విధమైన క్రమశిక్షణకు నిదర్శనమని ప్రశ్నించారు.

“ఒకే పార్టీలో అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటే.. స్థానిక నాయకులు మరో నిర్ణయం తీసుకోవడం బీఆర్‌ఎస్‌ నాయకత్వ వైఫల్యానికి నిదర్శనం. పార్టీ ఆదేశాలను ధిక్కరించే పరిస్థితి రావడం ఆ పార్టీ అంతర్గత పరిస్థితులను బయటపెడుతోంది” అని విమర్శించారు.

బీఆర్‌ఎస్‌లో క్రమశిక్షణ, నాయకత్వ నియంత్రణ పూర్తిగా కొరవడిందని.. తాండూరులో జరిగిన ఈ ఘటన ప్రజల ముందే ఆ పార్టీ అసలు పరిస్థితిని బయటపెట్టిందని కావలి సంతోష్‌ కుమార్ అన్నారు.