తాండూరు: భద్రేశ్వర దేవాలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పై కొందరు చేస్తున్న ఆరోపణలు, బురదజల్లే ప్రయత్నాలను మానుకోవాలని భద్రేశ్వర దేవాలయ రినోవేషన్ కమిటీ చైర్మన్ మేడి మహేష్ సూచించారు.
భద్రేశ్వర దేవాలయంలోని దాసోహంలో రినోవేషన్ కమిటీ సభ్యులు, ఆలయ దుకాణ సముదాయ యజమానులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేడి మహేష్ మాట్లాడారు.
తాండూరు భద్రేశ్వర దేవాలయానికి పూర్వ వైభవం తీసుకురావాలనే ముందుచూపుతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఎన్నికల సమయంలో వీరశైవ సమాజానికి ఇచ్చిన హామీలను ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం మాటలకే పరిమితం చేయకుండా ఆచరణలో పెట్టారని తెలిపారు.
ఎమ్మెల్యేగా గెలిచిన రెండు నెలల్లోనే దాసోహం నిర్మాణాన్ని చేపట్టి, నిత్య అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ద్వారా భక్తులకు మరింత సౌకర్యం కల్పించారని మేడి మహేష్ పేర్కొన్నారు.
భద్రేశ్వర దేవాలయాన్ని కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగా కాకుండా తాండూరుకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచేలా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే ముందుకు సాగుతున్నారని అన్నారు. ఆలయ పరిసరాల అభివృద్ధి, భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు.
గతంలో శిథిలావస్థకు చేరిన దుకాణ సముదాయాన్ని పునర్నిర్మించి ఆధునిక వసతులతో అభివృద్ధి చేయడం ద్వారా ఆలయ పరిసరాలకు కొత్త రూపు తీసుకొచ్చారని చెప్పారు. అక్కడ వ్యాపారం చేసుకుంటున్న కుటుంబాల జీవనోపాధి, వ్యాపార అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నూతన దుకాణ సముదాయాలను ఏర్పాటు చేసే చర్యలు చేపట్టారని పేర్కొన్నారు.
ఆలయం ముందు నెలకొంటున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపేలా నూతన దుకాణ సముదాయాల ఏర్పాటు చేయడం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముందుచూపుకు నిదర్శనమని మేడి మహేష్ అన్నారు. భక్తులు, వ్యాపారులు, స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ పరిసరాలను అభివృద్ధి చేయడమే ఎమ్మెల్యే లక్ష్యమని తెలిపారు.
గత బీఆర్ఎస్ పాలనలో భద్రేశ్వర దేవాలయ అభివృద్ధికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన విమర్శించారు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రస్తుత ఎమ్మెల్యే చొరవ చూపుతున్నారని అన్నారు. ఆలయ అభివృద్ధితో పాటు స్థానిక వ్యాపారుల సంక్షేమాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.
“ఎన్నికల ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని భద్రేశ్వర దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఘనత ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికే దక్కుతుంది. ఆలయ అభివృద్ధికి ముందుచూపుతో కృషి చేస్తున్న ఎమ్మెల్యేపై బురదజల్లే ప్రయత్నాలను మానుకోవాలి” అని మేడి మహేష్ అన్నారు.
అనంతరం భద్రేశ్వర ఆలయ దుకాణదారులు మాట్లాడుతూ.. గతంలో శిథిలావస్థకు చేరిన దుకాణాల స్థానంలో సువిశాలంగా, ఆకర్షణీయంగా నూతన దుకాణ సముదాయాలను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
తమ వ్యాపార అభివృద్ధికి ఎమ్మెల్యే ఎంతో సహకరించారని, దుకాణ నిర్మాణాలను తమ ఆధ్వర్యంలోనే ఇంజనీర్ల సహకారంతో చేపట్టేలా కృషి చేశారని వారు పేర్కొన్నారు. వ్యాపారుల సమస్యలను పరిగణనలోకి తీసుకుని వారికి అండగా నిలిచిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సమావేశంలో రినోవేషన్ కమిటీ సభ్యులు దేవనూర్ శంకర్, శెట్టి చంద్రకాంత్, గాజుల విజయ్ కుమార్, అగ్గనూర్ సంకేత్, మాజీ కౌన్సిలర్ లింగదల్లి రవికుమార్, భద్రేశ్వర దుకాణ సముదాయ యజమానులు సునీల్, శేషు, మాణిక్ రావు, సుధాకర్, రమేష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
