తాండూర్ ( సెప్టెంబర్ 3rd 2026 ) :తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పై బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలకు ఆధారాలను ప్రజల ముందుంచాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నాగరాజు డిమాండ్ చేశారు. ఆరోపణలు చేయడం మాత్రమే కాకుండా, వాటిని నిరూపించే అధికారిక పత్రాలు, కోర్టు ఉత్తర్వులు, కేసు వివరాలు బయటపెట్టాలని ఆయన ప్రశ్నించారు.
24 ఎకరాల వివాదాస్పద భూమికి సంబంధించి ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు ముందుగా ఆ భూములకు సంబంధించిన సర్వే నంబర్లు వెల్లడించాలని నాగరాజు కోరారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి లేదా జేబీ అక్రమాలకు పాల్పడ్డారని నిర్ధారించిన అధికారిక ఉత్తర్వులు ఏమైనా ఉంటే వాటిని ప్రజల ముందు ఉంచాలని అన్నారు.
CBI కేసు ఉందని చెబుతున్నారని, అసలు ఆ కేసు ఎవరిపై నమోదైంది? CBI కేసు నంబర్ ఏమిటి? దానికి సంబంధించిన అధికారిక రికార్డు ఎక్కడ ఉంది..?అని నాగరాజు ప్రశ్నించారు. ఆధారాలు చూపకుండా కేవలం CBI కేసు అంటూ ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
హైకోర్టు స్టే అంశంపై కూడా పూర్తి వివరాలు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. స్టే ఆర్డర్ వచ్చిన విషయాన్ని మాత్రమే ప్రస్తావిస్తూ, అనంతరం ఆ స్టే వేకేట్ అయిందా లేదా అనే అంశాన్ని ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న హైకోర్టు ఉత్తర్వును ప్రజల ముందు ఉంచాలని కోరారు.
ఇబ్రహీంపట్నంలో 33 ఎకరాల ప్రభుత్వ భూమి విషయంలో కూడా తుది రెవెన్యూ ఉత్తర్వులు, కలెక్టర్ ప్రొసీడింగ్స్ నంబర్‌ను వెల్లడించాలని నాగరాజు అన్నారు. మనోహర్ రెడ్డి ప్రభుత్వ భూమిని ఆక్రమించారని ఏదైనా కోర్టు తుది తీర్పు ఇచ్చి ఉంటే ఆ తీర్పును కూడా ప్రజలకు చూపించాలని డిమాండ్ చేశారు.
వికారాబాద్‌లో 250 ఎకరాల భూమికి సంబంధించిన ఆరోపణలపై కూడా సర్వే నంబర్లు, కేసు నంబర్లు, అక్రమం జరిగిందని నిర్ధారించిన తుది ఉత్తర్వులు లేదా కోర్టు తీర్పులు ఉంటే వాటిని బయటపెట్టాలని పట్టణ అధ్యక్షుడు కోరారు.
DCCBకు సంబంధించి చేసిన ఆరోపణలపై స్పందిస్తూ, ఇండివిడ్యువల్ సొసైటీల టెండర్ ప్రక్రియకు DCCB చైర్మన్‌కు ఉన్న అధికారాలు, సంబంధం ఏమిటో స్పష్టంగా వివరించాలని నాగరాజు అన్నారు. భాస్కర్ రెడ్డికి మనోహర్ రెడ్డి పనులు కట్టబెట్టారని ఆరోపించడానికి ఆధారం ఏమిటని ప్రశ్నించారు.
ఏ సొసైటీ? ఏ టెండర్? టెండర్ నంబర్ ఏమిటి? DCCB చైర్మన్ ఏ అధికారంతో ఆ టెండర్ కట్టబెట్టారు?సంబంధిత టెండర్ డాక్యుమెంట్లు, ప్రొసీడింగ్స్ లేదా ఆడిట్ నివేదికలు ఉంటే వాటిని ప్రజల ముందు ఉంచాలని నాగరాజు డిమాండ్ చేశారు.
“CBI కేసు అంటారా..? కేసు నంబర్ చూపించండి. కబ్జా అంటారా..? సర్వే నంబర్‌తో పాటు తుది ఉత్తర్వులు చూపించండి. హైకోర్టు అంటారా..? ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్డర్ చూపించండి DCCB టెండర్ అంటారా? టెండర్ నంబర్, ప్రొసీడింగ్స్ చూపించండి. అవినీతి అంటారా? ఆడిట్ రిపోర్ట్, FIR లేదా కోర్టు తీర్పు చూపించండి” అని నాగరాజు అన్నారు.
ప్రెస్మీట్లో ఆరోపణలు చేసినంత మాత్రాన అవి నిజాలు కావని, ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ప్రజల ముందుంచాల్సిన బాధ్యత ఆరోపణలు చేస్తున్న వారిపై ఉందని ఆయన పేర్కొన్నారు. ఆధారాలు ఉంటే ప్రజలే వాస్తవాలను నిర్ణయిస్తారని, ఆధారాలు లేకుండా రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని నాగరాజు అన్నారు.
