ప్రజాస్వామ్య పరిరక్షణకు ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ సమరం
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వైఖరిపై నిరసన..
జంతర్ మంతర్ ధర్నాకు ఎమ్మెల్యే బి మనోహర్ రెడ్డి
తాండూరు,అక్టోబర్ 11 (తెలంగాణ వార్త ప్రతినిధి:)
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తన రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర బాధ్యతలను విస్మరించి, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను పరిరక్షించాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించే ధర్నాలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పాల్గొననున్నారు.ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఢిల్లీకి తరలివెళ్తున్నారు. దేశ రాజధానిలో నిర్వహించే ఈ బృహత్ నిరసన కార్యక్రమం ద్వారా ఎన్నికల వ్యవస్థ స్వతంత్రత, ప్రజాస్వామ్య పరిరక్షణపై కాంగ్రెస్ పార్టీ తన నిరసన గళాన్ని బలంగా వినిపించనుంది.ఈ సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరిగే పోరాటంలో తాండూరు నియోజకవర్గ ప్రజల తరఫున ముందుండి పోరాడతామని స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. రాజ్యాంగ సంస్థలు స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు.ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు పార్టీ చేపట్టిన ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులు పిలుపునిస్తున్నాయి.
