కొత్త నేర చట్టాలపై పూర్తి పట్టు ఉండాలి
ప్రజలకు పారదర్శకమైన పోలీసింగ్ అందించాలి.. వికారాబాద్ ఎస్పీ స్నేహ మెహ్రా
తాండూర్ అక్టోబర్ 7 (తెలంగాణ వార్త ప్రతినిధి ) కొత్త నేర చట్టాలపై ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, IPS సూచించారు. చట్టపరమైన నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ ప్రజలకు మెరుగైన, పారదర్శకమైన పోలీసింగ్ సేవలు అందించాలని ఆమె ఆదేశించారు.కొత్త నేర చట్టాలు–2023 అమల్లోకి వచ్చిన నేపథ్యంలో జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ అధికారులు, సిబ్బందికి చట్టాలపై సమగ్ర అవగాహన కల్పించేందుకు డీటీసీ లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎస్పీ స్నేహ మెహ్రా పోలీస్ అధికారులు, సిబ్బందితో మాట్లాడి కొత్త చట్టాల అమలుపై వారి అవగాహనను తెలుసుకున్నారు.ఈ సందర్భంగాభారతీయ న్యాయ సంహిత–2023 ( బి.ఎన్.ఎస్ ), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత–2023 ( బి.ఎన్.ఎస్), భారతీయ సాక్ష్య అధినియం–2023 ( బి.ఎన్.ఎస్)లోని ముఖ్యమైన నిబంధనలపై ప్రతి ఒక్కరూ స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ సూచించారు. కేసుల నమోదు, దర్యాప్తు విధానాలు, సాక్ష్యాల సేకరణ, డిజిటల్–ఎలక్ట్రానిక్ సాక్ష్యాల ప్రాధాన్యత, బాధితుల హక్కులు, అరెస్ట్–రిమాండ్ విధానాలు, కోర్టు విచారణ తదితర అంశాలపై శిక్షణలో అవగాహన కల్పించారు.కొత్త చట్టాల అమలులో పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేయడం, దర్యాప్తు నాణ్యతను పెంచడం, ప్రజలకు మెరుగైన న్యాయ సేవలు అందించడమే శిక్షణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.విధుల నిర్వహణలో చట్టాలపై తమ పరిజ్ఞానాన్ని నిరంతరం పెంపొందించుకోవడంతో పాటు వృత్తిపరమైన నైపుణ్యాలను మరింతమెరుగుపరుచుకోవాలని ఎస్పీ స్నేహ మెహ్రా సూచించారు.ఈ కార్యక్రమంలో డీటీసీ డి.ఎస్.పి శ్రీనివాస్, టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ అన్వర్ పాషా, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
