ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి బస్‌పాస్ చార్జీలు భరించాలి:
బి.ఆర్.ఎస్.వి జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ రావు
తాండూరు, అక్టోబర్ 9( తెలంగాణ వార్త ప్రతినిధి )
తాండూరు నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులందరికీ ఉచిత బస్‌పాస్ సౌకర్యాన్ని కల్పించాలని బి.ఆర్.ఎస్.వి వికారాబాద్ జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ రావు డిమాండ్ చేశారు.
గతంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తన సొంత నిధుల నుంచి రూ. 5 లక్షలు వెచ్చించి విద్యార్థుల బస్‌పాస్ చార్జీలు చెల్లించారని గుర్తుచేశారు. అదే బాటలో ప్రస్తుత ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి కూడా స్పందించి విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ భారాన్ని భరించాలని కోరారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థులపై మోయలేని భారం
గ్రామీణ ప్రాంతాల నుంచి రోజూ పట్టణాలకు చదువుకునే వేలాది మంది పేద విద్యార్థులకు రవాణా ఖర్చులు తీవ్ర భారంగా మారాయి.
రవాణా ఇబ్బందులు విద్యార్థుల విద్యకు అడ్డంకిగా మారకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు.
నియోజకవర్గంలో దాదాపు 10,000 మంది విద్యార్థులకు ఈ నిర్ణయం లబ్ధి చేకూరుస్తుందని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం తాండూరు విద్యార్థులకు ఉచిత బస్‌పాస్ సౌకర్యం నిరంతరాయంగా అందేలా ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తక్షణమే చర్యలు తీసుకోవాలని వి.ఆర్.ఎస్.వి స్పష్టం చేసింది.
