నష్టపరిహారం అందని రైతులకు న్యాయం చేస్తాం ఆర్డీవో అనిత

—నష్టపరిహారం అందని రైతులకు న్యాయం చేస్తాం

–రైతుల ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పరిశీలన.. సమగ్ర నివేదిక ప్రభుత్వానికి

–దౌలాపూర్‌లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను పరిశీలించిన తాండూర్ సబ్ డివిజన్ ఆర్‌డీఓ అనిత

తాండూరు అక్టోబర్ 7 (తెలంగాణ వార్త ప్రతినిధి)

యాలాల మండలం దౌలాపూర్ రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబర్‌ 73లో ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ నిర్మాణం కోసం గతంలో భూములు తీసుకున్న రైతుల్లో కొంతమందికి నష్టపరిహారం అందలేదన్న ఫిర్యాదుల నేపథ్యంలో తాండూరు ఆర్‌డీఓ అనిత బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.భూములు కోల్పోయిన రైతుల్లో కొంతమందికి నష్టపరిహారం అందలేదని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఇటీవల ప్రెస్‌మీట్లు నిర్వహించడంతో పాటు కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో సమస్యను పరిశీలించేందుకు ఆర్‌డీఓ అనిత దౌలాపూర్‌లోని ప్రతిపాదిత ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ స్థలాన్ని సందర్శించారు. ప్రస్తుతం అక్కడ పాఠశాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.ఈ సందర్భంగా భూములు కోల్పోయిన రైతులతో ఆర్‌డీఓ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నష్టపరిహారం అందని రైతుల వివరాలను పరిశీలించి, వాస్తవ పరిస్థితులపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నష్టపరిహారం అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, సంబంధిత రికార్డులను సైతం పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో యాలాల తహసీల్దార్ గాయత్రి, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు యుబుగ్గప్ప, ఎంఆర్‌పీఎస్ నాయకుడు మహేందర్, రైతులు వెంకటయ్య, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.