—అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం.. బషీరాబాద్ ఎస్‌ఐ విఠల్ నిఘా..!
గంజాయి, బాలికల వేధింపులపై ప్రత్యేక ఫోకస్..!పోలీసుల చర్యలపై ప్రజల హర్షం
తాండూర్అక్టోబర్ 10 (తెలంగాణ వార్త ప్రతినిధి):
బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ కార్యకలాపాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అక్రమ ఇసుక రవాణాతో పాటు నిషేధిత గంజాయి, బాలికలు, మహిళలపై వేధింపుల వంటి అంశాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్నారు.
బషీరాబాద్ ఎస్‌ఐ విఠల్ ఆధ్వర్యంలో పోలీసులు పరిధిలో అనుమతులు లేకుండా ఇసుక తరలించే వాహనాలపై తనిఖీలు ముమ్మరం చేశారు. సమాచారం అందిన వెంటనే స్పందిస్తూ అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న వాహనాలను పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నట్లు సమాచారం. దీంతో అక్రమ ఇసుక రవాణాదారుల్లో అప్రమత్తత నెలకొంది.అదేవిధంగా యువతను తప్పుదోవ పట్టించే నిషేధిత గంజాయి వినియోగం, విక్రయంపై నిఘా కొనసాగిస్తున్న పోలీసులు.. బాలికలు, మహిళలపై వేధింపులకు పాల్పడే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకునేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలు, రద్దీ ప్రాంతాల వద్ద అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.పోలీస్ సిబ్బంది నుంచి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ, పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్న ఎస్‌ఐ విఠల్ తీరుపై మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఇదే విధంగా నిఘా కొనసాగించాలని వారు కోరుతూ ఎస్‌ఐ విఠల్‌ను అభినందిస్తున్నారు….
