ప్రజల ముంగిటకే ప్రజాప్రతినిధులు.. అధికార యంత్రాంగం

ప్రజల ముంగిటకే ప్రజాప్రతినిధులు.. అధికార యంత్రాంగం

–సమస్యల పరిష్కారమే లక్ష్యం.. స్వచ్ఛ తాండూరుపై బీఎంఆర్ ప్రత్యేక దృష్టి

ఆరు వార్డుల్లో విస్తృత పర్యటన.. పారిశుద్ధ్య పనులపై క్షేత్రస్థాయి పరిశీలన

తాండూరు అక్టోబర్ 06( తెలంగాణ వార్తా ప్రతినిధి)

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి తక్షణ పరిష్కారం చూపడమే లక్ష్యంగా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (బీఎంఆర్) క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. తాండూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛ తాండూరు స్పెషల్ డ్రైవ్”**లో భాగంగా పట్టణంలోని 26, 27, 33, 34, 35, 36 వార్డుల్లో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయా వార్డుల్లోని మురుగు కాలువల శుభ్రత, చెత్త సేకరణ, రోడ్లు, వీధుల పరిశుభ్రత, దోమల నివారణ చర్యలను ఎమ్మెల్యే దగ్గరుండి పరిశీలించారు. స్థానిక ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా? ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? అని ఆరా తీశారు.

*డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం* 

వార్డుల్లో డ్రైనేజీ సమస్యలను పరిశీలించిన ఎమ్మెల్యే, అవసరమైన ప్రాంతాలను గుర్తించి నూతన డ్రైనేజీ నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలని, మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ రోడ్లు, వీధులు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

దోమల నివారణకు నిరంతరం ఫాగింగ్ నిర్వహించాలని, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తిన తర్వాత చర్యలు తీసుకోవడం కాకుండా ముందస్తు నివారణ చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు.

*అంగన్వాడీ కేంద్రాలపై కూడా దృష్టి* 

పర్యటనలో భాగంగా ఆయా వార్డుల్లోని అంగన్వాడీ కేంద్రాలను కూడా ఎమ్మెల్యే పరిశీలించారు. కేంద్రాల్లోని పరిస్థితులు, పిల్లలకు అందుతున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు మెరుగైన వాతావరణం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

*నిరంతర ప్రక్రియగా స్వచ్ఛ తాండూరు* 

“స్వచ్ఛ తాండూరు స్పెషల్ డ్రైవ్” కేవలం ప్రత్యేక కార్యక్రమానికే పరిమితం కాకుండా నిరంతర ప్రక్రియగా కొనసాగాలని ఎమ్మెల్యే అన్నారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించాలని సూచించారు. పట్టణ ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు స్వచ్ఛమైన తాండూరు నిర్మాణంలో మున్సిపాలిటీకి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి, కమిషనర్ రాకేష్, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, వార్డు కౌన్సిలర్లు, అధికారులు, సీనియర్ నాయకులు, మున్సిపల్ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.