–ప్రతి గ్రామం కాంగ్రెస్‌కు కంచుకోట కావాలి.. ప్రతి కార్యకర్త ప్రజల మనసు గెలవాలి

—ప్రతి గ్రామం కాంగ్రెస్‌కు కంచుకోట కావాలి.. ప్రతి కార్యకర్త ప్రజల మనసు గెలవాలి

–పదవుల కోసం కాదు.. ప్రజల కోసం పనిచేయండి.. –గ్రామ కమిటీ అధ్యక్షులే పార్టీకి వెన్నెముక

–నూతన గ్రామ కమిటీ అధ్యక్షులకు ఎమ్మెల్యే బీఎంఆర్ దిశానిర్దేశం

యాలాల మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం……

తాండూర్ అక్టోబర్ 8 (తెలంగాణ వార్త ప్రతినిధి

గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని, నూతనంగా నియమితులైన గ్రామ కమిటీ అధ్యక్షులు ప్రజలతో మమేకమై పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఎస్వీఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన యాలాల్ మండల కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు

ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన అన్ని గ్రామాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు ఎమ్మెల్యే బీఎంఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీకి నాయకులు ఎంత ముఖ్యమో కార్యకర్తలు అంతకంటే ముఖ్యమైన బలమని అన్నారు. నాయకులు పార్టీకి దిశానిర్దేశం చేస్తే, ఆ దిశను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. పదవులతో సంబంధం లేకుండా ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవాలని, ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

కార్యకర్తల కష్టం నాకు తెలుసు.. అండగా ఉంటాపార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్త పని, కష్టం తనకు తెలుసని ఎమ్మెల్యే బీఎంఆర్ అన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రతి బూత్‌లో కార్యకర్తలు సమన్వయంతో చురుకుగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు.

యాలాల్ అభివృద్ధికి రూ.500 కోట్ల పనులు

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పనతో పాటు పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

యాలాల్ మండలంలో దాదాపు రూ.500 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, మండలంలోని రహదారి పనులను ఏడాదిలోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జుంటుపల్లి ప్రాజెక్టు పనులకు దాదాపు రూ.5 కోట్లు మంజూరు చేయించామని, త్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. దౌలపూర్‌లో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.

లక్ష్మీనారాయణపూర్–దేవనూర్, లక్ష్మీనారాయణపూర్–మైల్వార్ రహదారులతో పాటు కోకట్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతున్నామని అన్నారు. గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల భవనాలు, పాఠశాలల కాంపౌండ్ వాల్స్, గ్రామ పంచాయతీ భవనాలకు మంజూర్లు ఇచ్చి పనులు కొనసాగిస్తున్నామని వివరించారు.

యువతకు ఉచిత కోచింగ్.. యాలాల్‌కు కాగ్నా నీరు

తాండూరులో ఏటీసీ సెంటర్, బషీరాబాద్‌లో జూనియర్ కళాశాల మంజూరు చేయించామని ఎమ్మెల్యే తెలిపారు. తాండూరులో యువత కోసం ఉచిత కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. కాగ్నా నది నుంచి యాలాల్ మండలానికి మంచినీటిని అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ప్రతి కార్యకర్త పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, నాయకులు, యువకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.