అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం!

–అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం!-మాదకద్రవ్యాల విక్రయం, బాల్య వివాహాలపై ప్రత్యేక నిఘా….

మైనర్లకు వాహనాలిస్తే తల్లిదండ్రులపై కేసులు:

 డీఎస్పీ నర్సింగ్ యాదయ్య

తాండూరు అక్టోబర్ 10 (తెలంగాణ వార్త ప్రతినిధి):-తాండూరు డివిజన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు, మాదకద్రవ్యాల విక్రయాలు, బాలికలపై లైంగిక దాడులు, బాల్య వివాహాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డీఎస్పీ నర్సింగ్ యాదయ్య పోలీసు అధికారులను ఆదేశించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా పెంచి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. శనివారం తాండూర్ రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని పరిశీలించారు. 

మైనర్లకు వాహనాలిస్తే తల్లిదండ్రులపై కేసులు

మైనర్ బాలబాలికలకు వాహనాలు నడిపేందుకు అనుమతించే తల్లిదండ్రులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మాదకద్రవ్యాల విక్రయాలు, వినియోగంపై నిఘా పెంచడంతో పాటు బాలికలపై లైంగిక దాడులు, బాల్య వివాహాల వంటి నేరాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

గ్రామాల్లో అనుమానితులపై అప్రమత్తంగా ఉండాలి

పోలీసు సిబ్బంది క్రమం తప్పకుండా బీట్‌ విధులు నిర్వహించాలని, గ్రామాల్లో కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వారి వివరాలను పరిశీలించాలని సూచించారు. అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు సమన్వయంతో పనిచేయాలని పోలీసు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో తాండూరు రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, తాండూరు టౌన్ సీఐ పరమేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.