విద్యార్థులకు ఉచిత బస్‌పాస్‌లు కల్పించాలి!
ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి చొరవ తీసుకోవాలి
బీఆర్‌ఎస్‌వీ జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయరావు డిమాండ్
తాండూరు , అక్టోబర్ 9 తెలంగాణ వార్త ప్రతినిధి:-
తాండూరు నియోజకవర్గ పరిధిలోని గ్రామీణ ప్రాంత విద్యార్థులతో పాటు పట్టణాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులందరికీ ఉచిత బస్‌పాస్ సౌకర్యం కల్పించాలని బీఆర్‌ఎస్‌వీ జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయరావు డిమాండ్ చేశారు. పేద విద్యార్థులపై రవాణా ఖర్చుల భారం తగ్గించేందుకు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు.నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి తాండూరు పట్టణంతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లి చదువుకుంటున్న వేలాది మంది విద్యార్థులు ప్రతిరోజూ రవాణా ఖర్చుల కోసం ఇబ్బందులు పడుతున్నారని దత్తాత్రేయరావు పేర్కొన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు బస్‌పాస్ చార్జీలు అదనపు ఆర్థిక భారంగా మారుతున్నాయని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉచిత బస్‌పాస్ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.గతంలో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి విద్యార్థుల బస్‌పాస్ చార్జీల కోసం తన సొంత నిధుల నుంచి రూ.5 లక్షలు చెల్లించి సహకరించారని ఆయన గుర్తుచేశారు. అదే తరహాలో ప్రస్తుత ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి కూడా విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ బస్‌పాస్ చార్జీలను భరించేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.తాండూరు నియోజకవర్గంలో సుమారు 10 వేల మంది విద్యార్థులకు ఉచిత బస్‌పాస్ సౌకర్యం ప్రయోజనకరంగా ఉంటుందని దత్తాత్రేయరావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం విద్యార్థులకు ఈ సౌకర్యం అందేలా ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలని కోరారు. రవాణా ఖర్చుల కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరమయ్యే పరిస్థితి రాకుండా చూడాలని, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు సానుకూలంగా స్పందించాలని బీఆర్‌ఎస్‌వీ తరఫున ఆయన డిమాండ్ చేశారు.
