కేసీఆర్ దూరదృష్టికి కొత్త జిల్లాల ఏర్పాటు నిదర్శనం
ప్రజలకు పాలనను చేరువ చేసిన ఘనత కేసీఆర్‌దే: శ్రీశైల్ రెడ్డి
పైలట్ రోహిత్ రెడ్డి పిలుపుతో తాండూరు నుంచి భారీగా తరలివచ్చిన బీఆర్‌ఎస్ శ్రేణులు
వికారాబాద్, అక్టోబర్ 12 ( తెలంగాణ వార్త ప్రదినిది ): ప్రజలకు పాలనను చేరువ చేయాలనే లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక నిర్ణయమని తాండూరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి శ్రీశైల్ రెడ్డి అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలన ప్రజలకు మరింత చేరువైందని, ఇది కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనమని కొనియాడారు.
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కొత్త జిల్లాల ఏర్పాటు జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం వికారాబాద్‌లోని ఎన్‌టీఆర్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో కేసీఆర్ చిత్రపటానికి మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, శ్రీశైల్ రెడ్డి క్షీరాభిషేకం చేశారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పిలుపు మేరకు తాండూరు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా శ్రీశైల్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలోనే కాకుండా, రాష్ట్ర అభివృద్ధి, పరిపాలనా సంస్కరణల్లోనూ కేసీఆర్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన పనుల కోసం ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని, జిల్లాల పునర్వ్యవస్థీకరణతో ఆ ఇబ్బందులు తగ్గి ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువయ్యాయని అన్నారు.
ప్రజల అవసరాలు, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం ద్వారా పరిపాలనా సౌలభ్యం పెరిగిందని, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసే అవకాశం ఏర్పడిందని తెలిపారు. ఈ నిర్ణయం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంగా కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ క్షీరాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తాండూరు నియోజకవర్గంలోని వివిధ మండలాల బీఆర్‌ఎస్ అధ్యక్షులు, కార్యదర్శులు, కౌన్సిలర్లు, సర్పంచులు, మాజీ సర్పంచులు, సీనియర్ నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
