రాజ్యాంగ పరిరక్షణకు ఢిల్లీలో కాంగ్రెస్ సమరభేరి!

రాజ్యాంగ పరిరక్షణకు ఢిల్లీలో కాంగ్రెస్ సమరభేరి!

అరెస్టులకు భయపడేది లేదు.. వెనక్కి తగ్గేది లేదు: రాహుల్ గాంధీ

ఏఐసీసీ పిలుపుతో ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. నిరసనలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

ఢిల్లీ, అక్టోబర్ 12 ( తెలంగాణ వార్తప్రతినిధి):

భారత రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల కాపాడటమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దేశ రాజధాని ఢిల్లీలో నిరసన గళం వినిపించింది. ఏఐసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నాయకత్వంలో చేపట్టిన ఆందోళనలో తెలంగాణకు చెందిన ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సైతం ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఢిల్లీలోని బారాఖంబా రోడ్‌తో పాటు సెంట్రల్ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) అంశంపై, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ నేతృత్వంలో సుప్రీంకోర్టు వైపు మార్చ్ చేపట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో భారీగా పోలీసు బలగాలను మోహరించడంతో పాటు, కొన్ని మెట్రో స్టేషన్లలో సేవలకు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం.

అరెస్టులకు భయపడేది లేదు!

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. గత దశాబ్దానికి పైగా తాను వారిని రాజకీయంగా ఎదుర్కొంటున్నానని, వారి విధానాలను క్షుణ్ణంగా అర్థం చేసుకున్నానని పేర్కొన్నారు. ఎంతమంది పోలీసులను మోహరించినా, ఎంతమంది నాయకులు, యువతను అరెస్టు చేసినా తాము వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు తమ పోరాటం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

యువత పోరాటానికి అండగా ఉంటాం

భారత రాజ్యాంగాన్ని కాపాడటం, దేశ ప్రజల గొంతుకను పరిరక్షించడం తమ ప్రధాన లక్ష్యమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. గత 10–15 ఏళ్లలో దేశానికి జరిగిన నష్టం పునరావృతం కాకుండా చూస్తామని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం యువత నిరసనలను కొనసాగించాలని పిలుపునిస్తూ, వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలని పార్టీ శ్రేణులకు సందేశమిచ్చారు.ఢిల్లీ నిరసనలో తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం పార్టీ జాతీయ స్థాయి ఆందోళనకు రాష్ట్ర నాయకత్వం మద్దతును చాటింది. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొనడం ఈ ప్రాంత కాంగ్రెస్ శ్రేణుల్లోనూ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.