తాండూరు, అక్టోబర్ 30 ( తెలంగాణ వార్త ప్రతినిధి):గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి రహదారులు, మురుగు కాలువలు, విద్యా సంస్థలకు ప్రహరీలు, మహిళా సంఘాలకు భవనాలు వంటి సదుపాయాలు కీలకమని తెలిపారు.బషీరాబాద్ మండలం రెడ్డిఘనపూర్ గ్రామంలో శుక్రవారం రూ.68.60 లక్షల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేయడంతో పాటు పూర్తయిన పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో రూ.10 లక్షలతో ఎస్సీ వాడలో సైడ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణానికి, రూ.10 లక్షలతో మహిళా సంఘం భవనానికి, రూ.13.60 లక్షలతో ఎంపీపీఎస్, జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలకు ప్రహరీ గోడల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా రూ.9 లక్షలతో రైతులకు ఉపయోగపడే మట్టి రహదారి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.రూ.6 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును, రూ.20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం కుర్వ విజయలక్ష్మి రాములు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు
444 కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు
గ్రామంలో 444 మంది లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ ఆహార భద్రత పథకాల ప్రయోజనాలు అందుతాయని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంత ఇంటి కల నెరవేరేలా అర్హులైన పేదలకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందని తెలిపారు.గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను గుర్తించి దశలవారీగా అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. పాఠశాలల్లో ప్రహరీల నిర్మాణం, గ్రామాల్లో రహదారులు, డ్రైనేజీల ఏర్పాటు ప్రజల దైనందిన జీవనానికి, విద్యార్థుల భద్రతకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, సర్పంచులు, గ్రామ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
