ప్రజాసేవే లక్ష్యంగా మానవతా దృక్పథంతో ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు,అక్టోబర్ 18(తెలంగాణ వార్త ప్రతినిధి):తాండూరు నియోజకవర్గంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ఎన్నికల సమయంలో, లేదా గ్రామ పర్యటనల్లో ప్రజలకు ఇచ్చిన మాటను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకుంటానని చేతల్లో నిరూపిస్తున్నారు. తాజాగా పెద్దేముల్ మండలం బండమీదిపల్లి గ్రామ పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు, ఓ దివ్యాంగురాలి కుటుంబానికి ఆయన అండగా నిలిచారు.గ్రామ పర్యటనలో భాగంగా బండమీదిపల్లికి చెందిన చాకలి పుష్పమ్మ కుటుంబాన్ని కలిసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, ముఖ్యంగా పుష్పమ్మ పడుతున్న అనారోగ్య ప్రయాణ కష్టాలను సానుభూతితో తెలుసుకున్నారు. దివ్యాంగురాలైన పుష్పమ్మ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నట్లు గ్రహించి, ఆమె స్వయం ఉపాధికి లేదా ప్రయాణ సౌకర్యం కోసం ప్రత్యేకంగా దివ్యాంగుల వాహనం కొనుగోలు చేయడానికి రూ. 50,000/- ఆర్థిక సహాయం అందిస్తామని ఆ సమయంలో హామీ ఇచ్చారు.ఇచ్చిన మాట ప్రకారం తాండూరు నియోజకవర్గ కేంద్రంలో బాధితురాలి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే బీఎంఆర్ స్వయంగా రూ.50,000/- ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కష్టాల్లో ఉన్న పేదలకు ఆపద్బాంధవుడిగా నిలుస్తూ, ఏ సమయంలో ఎవరికీ ఏ ఆపదొచ్చినా తాను అండగా ఉంటాననే భరోసానిస్తున్న ఎమ్మెల్యే బీఎంఆర్ చర్యపై బండమీదిపల్లి గ్రామస్తులు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సమాజంలో నిరాదరణకు గురవుతున్న దివ్యాంగులకు, అభాగ్యులకు చేయూతనివ్వడం ప్రజా ప్రతినిధుల బాధ్యతని భావిస్తూ ఎమ్మెల్యే బీఎంఆర్ నిరంతరం సేవా కార్యక్రమాలను కొనసాగిస్తుండడం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.ఇచ్చిన హామీని నిలబెట్టుకుని తనకు అండగా నిలిచిన ఎమ్మెల్యేకు పుష్పమ్మ సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను గుర్తుంచుకుని ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దివ్యాంగురాలికి సాయం అందించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
