శాంతిభద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యం మహిళల వేధింపులు, డ్రగ్స్‌పై ప్రత్యేక నిఘా మైనర్లకు వాహనాలిస్తే కఠిన చర్యలు నూతన ఎస్ ఐ గా బాధ్యత స్వీకరణ. కరణ్‌కోట్ ఎస్సై డి. అన్వేష్ కుమార్ రెడ్డి

తాండూరు, అక్టోబర్ 17 (తెలంగాణ వార్త ప్రతినిధి)కరణ్‌కోట్ పోలీస్‌స్టేషన్ నూతన ఎస్సైగా డి. అన్వేష్ కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందిస్తూ, నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

మహిళల వేధింపులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, మహిళల భద్రతకు భంగం కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. యువత డ్రగ్స్‌ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు.

మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని పేర్కొంటూ, తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇచ్చే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా మైనర్లకు వాహనాలు ఇచ్చే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రజలు చట్టాలను గౌరవిస్తూ పోలీసులకు సహకరించాలని, గ్రామాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఎస్సై కోరారు. ప్రజల సహకారంతో నేరాల నియంత్రణకు కృషి చేస్తూ, కరణ్‌కోట్ పరిధిలో ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పుతామని ఆయన తెలిపారు.