ఎమ్మెల్యే బీఎంఆర్ చొరవతో దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం!

వార్డుల వారీగా స్పెషల్ డ్రైవ్.. ప్రజల వద్దకే వెళ్లి సమస్యలపై ఆరా

కాలువలు, మంచినీరు, వీధిదీపాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు

తాండూరు, అక్టోబర్ 30 (తెలంగాణ వార్త ప్రతినిధి):తాండూరు పట్టణంలోని వార్డుల్లో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (బీఎంఆర్) ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి మంగళవారం మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మార్నింగ్ వాక్‌లో పాల్గొంటూ, వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నారు. వారానికి నాలుగైదు వార్డుల చొప్పున స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ, స్థానికులతో మమేకమై మౌలిక సదుపాయాల స్థితిగతులను పరిశీలిస్తున్నారు.ఈ క్రమంలో పోట్లి మహారాజ్ కాంప్లెక్స్ ముందు, గాంధీనగర్‌లోని అంగన్‌వాడీ కేంద్రం పక్కన చాలా కాలంగా పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని ఎమ్మెల్యే గుర్తించారు. వెంటనే స్పందించి సంబంధిత మున్సిపల్ అధికారులకు ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచి పారిశుధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో స్పందించిన మున్సిపల్ సిబ్బంది పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. దీంతో దీర్ఘకాలంగా నెలకొన్న సమస్యకు పరిష్కారం లభించిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.అదేవిధంగా పట్టణంలోని పలు వార్డుల్లో నెలకొన్న మురుగు కాలువలు, తాగునీటి సరఫరా, వీధిదీపాల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూనే, స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.ఇందులో భాగంగా శుక్రవారం కూడా పలు వార్డుల్లో మున్సిపల్ అధికారులు పనులు ప్రారంభించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై తక్షణ స్పందనతో పాటు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను గుర్తించి దశలవారీగా పరిష్కరించే దిశగా స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది.