మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత

మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత

ఉమెన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ స్నేహ మెహ్రా వార్షిక తనిఖీ.. పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

*తాండూర్ అక్టోబర్ 5 తెలంగాణ వార్త ప్రతినిధి*

మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, బాధితులకు సత్వర న్యాయం అందేలా పోలీసులు సమర్థవంతంగా పనిచేయాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం వికారాబాద్ జిల్లా ఉమెన్ పోలీస్ స్టేషన్‌ను ఆమె తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని వివిధ విభాగాలు, స్టేషన్ నిర్వహణ, రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, ఫిర్యాదుల పరిష్కార స్థితిగతులను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. నమోదైన కేసులకు సంబంధించిన ఫైళ్లను పరిశీలిస్తూ ఆయా కేసుల దర్యాప్తు ఏ దశలో ఉందనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.మహిళలకు సంబంధించిన కేసుల్లో సత్వర స్పందన, సమర్థవంతమైన దర్యాప్తు, బాధితులకు సకాలంలో న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలు, బాలికల నుంచి వచ్చే ఫిర్యాదులను సున్నితంగా స్వీకరించి, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు.పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తును వేగవంతం చేయాలని, నిర్దేశిత సమయంలో కేసులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించడంతో పాటు CCTNS, e-Sakshya వంటి పోలీస్ సాంకేతిక వ్యవస్థలను సక్రమంగా ఉపయోగించాలని ఆదేశించారు.స్టేషన్‌లోని కేసు డైరీలు, రిజిస్టర్లు, ఫిర్యాదుల నమోదు, దర్యాప్తు పత్రాలు తదితర రికార్డులను పరిశీలించిన ఎస్పీ.. అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంచాలని సూచించారు. ప్రతి కేసుకు సంబంధించిన వివరాలు సక్రమంగా నమోదు చేయాలని స్పష్టం చేశారు.

అనంతరం స్టేషన్ పరిసరాలు, పరిశుభ్రత, సిబ్బంది విధుల నిర్వహణ, మౌలిక సదుపాయాలను కూడా ఎస్పీ పరిశీలించారు. విధి నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రజలతో, ముఖ్యంగా మహిళలతో స్నేహపూర్వకంగా, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.

మహిళల్లో పోలీస్ శాఖపై మరింత నమ్మకం పెంపొందించేలా విమెన్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని, మహిళలు ఎలాంటి భయాందోళన లేకుండా పోలీసులను ఆశ్రయించేలా నమ్మకమైన వాతావరణాన్ని కల్పించాలని ఎస్పీ స్నేహ మెహ్రా సూచించారు.

అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బందితో మాట్లాడిన ఎస్పీ వారి విధులు, ఎదుర్కొంటున్న సమస్యలు, అవసరమైన సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు అంకితభావంతో పనిచేయాలని సిబ్బందికి సూచించారు.

ఈ తనిఖీలో ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వెంకట్ రామ్ నాయక్, ఎస్‌ఐ అనితతో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.