తాండూరు అభివృద్ధికి రూ.154 కోట్ల ప్రణాళికలు ఏడాదిలో కాగ్నా నది నీరు.. ఆరు బస్తీ దవాఖానాలు

 


తాండూరు అభివృద్ధికి రూ.154 కోట్ల ప్రణాళికలు

ఏడాదిలో కాగ్నా నది నీరు.. ఆరు బస్తీ దవాఖానాలు

మంచినీటి పైపులైన్లు, రోడ్లు–మురుగు కాలువలకు భారీగా నిధులు

 *తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

తాండూరు అక్టోబర్ 06 తెలంగాణ వార్త ప్రతినిధి 

తాండూరు పట్టణ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రూ.154 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తెలిపారు. మంగళవారం తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పట్టణ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ఆయన వెల్లడించారు.తాండూరు పట్టణ ప్రజల దీర్ఘకాలిక మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. 30–35 సంవత్సరాల క్రితం నిర్మించిన మంచినీటి పైపులైన్ వ్యవస్థ మరమ్మతులు, పునరుద్ధరణకు రూ.110 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. అలాగే నూతనంగా ఏర్పడుతున్న కాలనీల్లో మంచినీటి పైపులైన్ల నిర్మాణానికి రూ.25.8 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.తాండూరు పట్టణానికి ఏడాదిలో కాగ్నా నది నీటిని అందించేలా చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు.పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా మురుగు కాలువలు, రోడ్ల నిర్మాణానికి రూ.18 కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పట్టణంలోని ప్రతి వార్డులో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను గుర్తించి అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు.అదేవిధంగా తాండూరు పట్టణంలో ఆరు బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. పేద, మధ్యతరగతి ప్రజలకు వారి నివాస ప్రాంతాలకు సమీపంలోనే ప్రాథమిక వైద్య సేవలు అందేలా ఈ దవాఖానాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ప్రతి వార్డుకు ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక*తాండూరు పట్టణ అభివృద్ధి కోసం ప్రతి వార్డుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని వార్డు అధికారులకు, మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆయా వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటి పరిష్కారానికి అవసరమైన పనులను ప్రణాళికలో చేర్చాలని సూచించినట్లు చెప్పారు.తాగునీరు, రోడ్లు, మురుగు కాలువలు, పారిశుధ్యం, వైద్య సదుపాయాలు వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించి తాండూరును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్రెడ్డి, కమిషనర్ రాకేష్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు