ఓటు హక్కును కాపాడాలి.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి*
*ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను పదవి నుంచి తొలగించాలి:*
*తాండూరు ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి*
*తాండూర్ అక్టోబర్ 6 (తెలంగాణ వార్త ప్రతినిధి)
ఓటు హక్కు పరిరక్షణతో పాటు ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షుడు జాదవ్ దారాసింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన “ఓటు బచావో–దేశ్ బచావో” నిరసన ర్యాలీలో పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డితో కలిసి బుయ్యాని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపై ప్రతిపక్షాలు, ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు తమకు అనిపిస్తోందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు పూర్తి విశ్వాసం కలిగేలా ఎన్నికల సంఘం పారదర్శకంగా, స్వతంత్రంగా పనిచేయాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, ఓటు హక్కుకు ఎలాంటి ముప్పు కలగకుండా రాజకీయ పార్టీలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బుయ్యాని మనోహర్ రెడ్డి అన్నారు. “ఓటును కాపాడితేనే ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్లవుతుంది” అని పేర్కొన్నారు.
ఈ నిరసన ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
