ఆరు ఏళ్ల అహన్యకు దక్కని సకాల వైద్యం.. కన్నీరుమున్నీరైన తండ్రి

ఆరు ఏళ్ల అహన్యకు దక్కని సకాల వైద్యం.. కన్నీరుమున్నీరైన తండ్రి

కొడంగల్ జిల్లా ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణపై తీవ్ర విమర్శలు.. ‘సరైన సమయంలో వైద్యం అందించి ఉంటే నా కూతురు బతికేది’

తాండూర్ అక్టోబర్ 4 తెలంగాణ వార్త ప్రతినిధి

జిల్లా ఆసుపత్రిగా పేరు మార్చినా వైద్య సేవల పరిస్థితిలో మాత్రం మార్పు కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత రెండు రోజుల క్రితం బాలింత, శిశువు మృతి ఘటన మరువకముందే.. తాజాగా ఆరు సంవత్సరాల చిన్నారి అహన్య మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది.శనివారం కొడంగల్ జిల్లా ఆసుపత్రిలో చిన్నారి అహన్య మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. చిన్నారి ఆరోగ్యం బాగానే ఉందని చెప్పిన వైద్యులు.. అనంతరం హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సకాలంలో వైద్య సేవలు అందించి ఉంటే తమ కుమార్తె ప్రాణాలు దక్కేవని చిన్నారి తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.పేరుకే జిల్లా ఆసుపత్రి.. ఇక్కడ సరైన వైద్యం అందడం లేదు. సాధారణ చికిత్సలకు కూడా వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. నా చిన్నారికి సకాలంలో వైద్యం అందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు” అంటూ తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు.వైద్య విధాన పరిషత్ రికార్డుల్లో తాండూరు స్థానంలో కొడంగల్ పేరు దర్శనమిస్తున్నా.. జిల్లా ఆసుపత్రికి అవసరమైన స్థాయిలో వైద్యులు, వైద్య సిబ్బంది, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వరుస ఘటనల నేపథ్యంలో ఆసుపత్రి నిర్వహణ, వైద్యుల పర్యవేక్షణపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రజలు కోరుతున్నారు.బాలింత–శిశువు మృతి ఘటన మరువకముందే మరో చిన్నారి మృతి చెందడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి కొడంగల్ జిల్లా ఆసుపత్రిలో వైద్య సౌకర్యాలను పూర్తిస్థాయిలో మెరుగుపరచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.