బిఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదింటి యువతకు శిక్షణ
తాండూర్ శాసనసభ్యులు బి. మనోహర్ రెడ్డి
పేదింటి యువతకు కొత్త ఆశలు
* ఉచిత శిక్షణతో కొలువుల వైపు అడుగులు
* పలుమార్లు మెగా జాబ్ మేళాలు
తాండూర్, అక్టోబర్ 11( తెలంగాణ వార్త ప్రతినిధి)
పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన నిరుద్యోగ యువత భవిష్యత్తుకు భరోసానిస్తూ బిఎమ్ఆర్ (BMR) ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తాండూర్ శాసనసభ్యులు బి. మనోహర్ రెడ్డి తెలిపారు. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించి, వారిని ఉద్యోగ ఉపాధి అవకాశాల వైపు నడిపించడమే ధ్యేయంగా ఫౌండేషన్ నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
ఉచిత శిక్షణతో కొలువుల వైపు అడుగులు:
మారిన కాలానికి అనుగుణంగా వివిధ రంగాల్లో అవసరమైన నైపుణ్యాలను (Skill Developmenet)యువతకు నేర్పించేందుకు బిఎమ్ఆర్ ఫౌండేషన్ ప్రత్యేక శిక్షణ తరగతులను అందుబాటులోకి తెచ్చింది. శిక్షణతో పాటు విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ, వారిని ఉద్యోగార్థులుగా మార్చేందుకు నిపుణులచే ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తున్నారు. ఈ కార్యక్రమాలు పేదింటి యువత జీవితాల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తున్నాయి.
పలుమార్లు మెగా జాబ్ మేళాలు:
కేవలం శిక్షణకే పరిమితం కాకుండా, అర్హులైన యువతకు నేరుగా ఉద్యోగాలు కల్పించేందుకు పలుమార్లు మెగా జాబ్ మేళాలను ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ప్రముఖ దిగ్గజ కంపెనీలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, వందలాది మంది యువతీయువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడం విశేషం.
ఉచిత శిక్షణ శిబిరంలో అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ
నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు అండగా నిలుస్తూ, ఉచిత శిక్షణ శిబిరంలో అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందించిన ఘనత తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (బీఎంఆర్)కు దక్కింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువత చదువుకు ఆటంకం కలగకుండా అవసరమైన మెటీరియల్ అందించడం అభ్యర్థులకు ఉపయోగకరంగా నిలవనుంది.
నిరుద్యోగ యువతకు సరైన మార్గదర్శకత్వం, నాణ్యమైన శిక్షణ, అవసరమైన అధ్యయన సామగ్రి అందితే ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు మరింత కృషి చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉచిత శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్ అందించడం యువతకు తోడ్పాటుగా నిలుస్తోంది.
యువతకు అవకాశాలే లక్ష్యం:
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బి. మనోహర్ రెడ్డి మాట్లాడుతూ… “సమాజంలో ప్రతి పేద యువకుడికి, యువతికి వారి కాళ్ళపై వారు నిలబడేందుకు తగిన అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలి. యువతలోని ప్రతిభను వెలికితీసి, వారికి సరైన మార్గదర్శకత్వం అందించినప్పుడే నవసమాజ నిర్మాణం సాధ్యమవుతుంది” అని పిలుపునిచ్చారు. బిఎమ్ఆర్ ఫౌండేషన్ ద్వారా భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ, ఉపాధి కార్యక్రమాలను చేపడతామని ఆయన స్పష్టం చేశారు.
