సామ రామ్మోహన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి
కాంగ్రెస్ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు అమోఘం: ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి
తాండూరు, అక్టోబర్ 22 (తెలంగాణ వార్త ప్రతినిధి)హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి రామ్మోహన్ రెడ్డి చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు.గురువారం శంషాబాద్ సమీపంలోని మల్లికా కన్వెన్షన్లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సామ రామ్మోహన్ రెడ్డి అందించిన సేవలు, ఆయన పోరాట పటిమను గుర్తించిన రాష్ట్ర నాయకత్వం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించడం గర్వకారణమన్నారు.న్యాయవాదిగా, మంచి వక్తగా, ప్రజల సమస్యలను సమర్థంగా వివరించగల నాయకుడిగా రామ్మోహన్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. గతంలో విద్యార్థుల సమస్యలపై అనేక చర్చలు, పోరాటాల్లో పాల్గొని, వారికి అవసరమైన విద్యా సదుపాయాల కల్పన కోసం కృషి చేశారని వివరించారు. విద్యావంతుల సమస్యలపై అవగాహన, ప్రజా సమస్యల పట్ల నిబద్ధత కలిగిన నాయకుడు ఎమ్మెల్సీగా ఎన్నికైతే పట్టభద్రుల గొంతుకను శాసనమండలిలో బలంగా వినిపించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.ఈ ఎన్నికల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయులు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా నిలవాలని కోరారు. ముఖ్యంగా వికారాబాద్ జిల్లా, తాండూరు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీ సాధించేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
