తాండూరు, అక్టోబర్ 17 (తెలంగాణ వార్త ప్రతినిధి) : తాండూరు గడ్డపై కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష అని, వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించడం ఖాయమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు సర్వేలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే బీఆర్‌ఎస్ నాయకుల పగటి కలలు కల్లలవుతాయని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
శనివారం పెద్దేముల్ మండల కేంద్రంలో జరిగిన రైతు సేవా సహకార సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు . ప్రజల ఆశీస్సులతో నియోజకవర్గంలో నూతన రాజకీయ శకం ప్రారంభమైందని కొనియాడారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయం.. అభివృద్ధి శకం!
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తాండూరు అభివృద్ధికి తాము చేస్తున్న కృషినివివరిస్తూ, నియోజకవర్గ ప్రజలకు పలు కీలక వరాలు ప్రకటించారు:
పీఏసీఎస్‌గా ఏసీఎస్‌ఎన్ మార్పు: పెద్దేముల్ ఏసీఎస్‌ఎన్‌ను త్వరలోనే పీఏసీఎస్‌గా అప్‌గ్రేడ్ చేసి రైతులకు మరింత మేలు చేకూరుస్తామని హామీ ఇచ్చారు.డీసీసీబీ బ్రాంచ్ ఏర్పాటు: పెద్దేముల్‌లో నూతన డీసీసీబీ బ్యాంకు శాఖను ఏర్పాటు చేయడంతో పాటు, ఎల్డీ రుణాలు, ఇళ్ల నిర్మాణానికి కావలసిన ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు.
విదేశీ విద్యకు బాటలు: స్థానిక రైతుల పిల్లలు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు ప్రత్యేక రుణాలు ఇప్పిస్తామని, అలాగే రైతుల సౌకర్యార్థం ప్రత్యేక లాకర్‌ను ఏర్పాటు చేసి బంగారంపై రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని సంచలన ప్రకటన చేశారు.
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే!
గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తాండూరు ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందని, ‘జంగీల్‌రాజ్’ వ్యవస్థను సృష్టించి అభివృద్ధిని అటకెక్కించారని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి దుయ్యబట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామని ప్రగల్భాలు పలుకుతున్న గులాబీ నేతలు, ఎంపీ ఎన్నికల్లో తాండూరులో బీఆర్‌ఎస్‌కు వచ్చిన ‘గుండుసున్నా’ ఫలితాన్ని గుర్తుంచుకోవాలని చురకలంటించారు. మున్సిపల్ ఎన్నికలు మరియు సర్పంచ్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అఖండ విజయం సాధించారన్నారు.
వేడుకల్లో ప్రముఖుల సందడి
ఈ అట్టహాస ప్రమాణ స్వీకార వేడుకలో నూతన పాలకవర్గ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లను నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, పీఏసీఎస్ చైర్మన్లు మహిపాల్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, కోట్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ అనిత, మధు లత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉత్తమ్‌చందు, కరణం పురుషోత్తం రావు, నారాయణరెడ్డి, శోభారాణి, లొంక నర్సిములు, సర్దార్ ఖాన్, రియాజ్, గోపాల్, అంజయ్య, బుజ్జమ్మ, డీవై నర్సిములు, ఆనంద్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
