ఎల్‌నినో సంక్షోభం….ప్రతి ఒక్కరూ సహకరించాలి
రైతులు పెద్ద మనసుతో ఒక సీజన్ పంటను వాయిదా వేసుకోవాలి
కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా ఆదుకోవాలి
ప్రకృతి విపత్తు నిధి సాయం అందించాలి
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
తాండూర్ అక్టోబర్ 16 (తెలంగాణ వార్త ప్రతినిధి)
ప్రపంచవ్యాప్తంగా విరుచుకుపడుతున్న ‘ఎల్‌నినో’ ప్రతికూల ప్రభావం వల్ల రాష్ట్రంలో తలెత్తిన తీవ్ర వర్షాభావ పరిస్థితులను, సాగు-తాగునీటి మరియు విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి రాష్ట్ర రైతాంగంతో పాటు ప్రతి ఒక్కరూ సహకరించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రకృతి ప్రకోపంతో సంభవించిన ఈ విపత్తును జయించడంలో కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరించాలని కోరారు నేడు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులతో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావం, నీటి ఎద్దడిపై సీఎం సుదీర్ఘంగా సమీక్షించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీతక్క, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల రావులతో కలిసి మీడియాతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఒక సీజన్ పంట వాయిదా వేసుకోండి: రైతులకు విజ్ఞప్తి
“సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రైతులు పెద్ద మనసుతో ఎండాకాలం వరి పంటలు వేయడం తగ్గించుకోవాలి. ఒక సీజన్ పంట పండించే పనులను వాయిదా వేసుకొని, అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలి. తప్పుడు ప్రచారాలు నమ్మి వరి పంటలు వేస్తే నీరు అందక పంట ఎండిపోవడమే కాకుండా, పెట్టుబడి నష్టపోవాల్సి వస్తుంది. ఎల్‌నినోను ఎదుర్కొనడానికి ప్రజలకు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేస్తున్నాం” అని ముఖ్యమంత్రి వివరించారు.
రాజకీయాలకు అతీతంగా పోరాడుదాం
* అఖిలపక్ష సమావేశం: దసరా పండుగ తర్వాత ఎల్‌నినో పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని పార్టీల సలహాలు, సూచనలు తీసుకుంటామని సీఎం తెలిపారు. ఢిల్లీ యాత్ర: నవంబర్ మొదటి వారంలో అఖిలపక్ష ప్రతినిధి బృందంతో కలిసి ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలసి కేంద్ర సాయం కోరుతామని చెప్పారు. కేంద్రం ఆదుకోవాలి: పంట నష్టపోయిన రైతులకు, ఎండాకాలంలో వాయిదా వేసుకునే పంట నష్టానికి కూడా కేంద్ర ప్రభుత్వం ‘ప్రకృతి విపత్తుల నిధి’ నుంచి సాయం అందించాలని, సెంట్రల్ పూల్ నుంచి సబ్సిడీపై అదనంగా విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రిజర్వాయర్లలో నీరు సగం పైగా తగ్గింది
“గతేడాది ఇదే సమయానికి రిజర్వాయర్లలో 462 టీఎంసీల నీరు ఉండగా, ప్రస్తుతం 200 టీఎంసీలు మాత్రమే ఉంది. రాబోయే 8 నుంచి 10 నెలల పాటు ఈ నీటిని పొదుపుగా వాడుకోవాలి. రాష్ట్రంలోని 24 వేల గ్రామాలకు తాగునీరు అందించాల్సి ఉంది. మార్చిలో ఉండే 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఇప్పుడే నమోదు అవుతున్నాయి. రానున్న రోజుల్లో నీరు, విద్యుత్ కొరత తీవ్రం కానుంది” అని హెచ్చరించారు.
విద్యుత్ కొరత ఉన్నా.. రైతుల కోసం కొనుగోలు
గతంలో సగటున 15 వేల మెగావాట్లు ఉన్న విద్యుత్ వినియోగం ఇప్పుడు రికార్డు స్థాయిలో 20 వేల మెగావాట్లకు చేరిందని సీఎం తెలిపారు. రాబోయే 15-20 రోజుల్లో వర్షాకాలం పంట కోతలు పూర్తవుతాయని, చేతికొచ్చిన పంట ఎండిపోకుండా రైతులకు అండగా ఉండటానికి మార్కెట్‌లో ఏ ధరకు దొరికినా విద్యుత్‌ను కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నామని చెప్పారు.
సహాయక చర్యలు – ముఖ్యాంశాలు: కూలీలకు ఉపాధి: భూమిలేని నిరుపేద కూలీలను ఆదుకునేందుకు 2.5 లక్షల మందికి ఉపాధి హామీ పనులు కల్పించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నాం.ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో సబ్ కమిటీ: విపత్తు పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు.నోడల్ ఆఫీసర్ వార్ రూమ్: ప్రజలకు అధికారిక సమాచారం అందించేందుకు సీఎం సలహాదారు కే. రామకృష్ణా రావు గారిని నోడల్ అధికారిగా నియమించాం. 24 గంటలు పనిచేసేలా టోల్ ఫ్రీ నంబర్‌తో ‘వార్ రూమ్’ ఏర్పాటు చేస్తున్నాం. అప్రమత్తత: పశుగ్రాసం, తాగునీరు, ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తకుండా వైద్య ఆరోగ్య శాఖతో పాటు అన్ని శాఖలను అప్రమత్తం చేశాం.ఈ ప్రకృతి విపత్తును ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు, ఇతర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మహిళా, విద్యార్థి సంఘాలు, ప్రజలందరూ సహకరించాలని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
