పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం.. విధుల్లో నిర్లక్ష్యం వద్దు! తాండూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలపై ఎమ్మెల్యే బీఎంఆర్ సమీక్ష రోగులతో ఆప్యాయంగా మాట్లాడి ధైర్యం చెప్పాలి.. ఓపీ సేవలు సమయానికి ప్రారంభించాలి

పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం.. విధుల్లో నిర్లక్ష్యం వద్దు!

తాండూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలపై ఎమ్మెల్యే బీఎంఆర్ సమీక్ష

రోగులతో ఆప్యాయంగా మాట్లాడి ధైర్యం చెప్పాలి.. ఓపీ సేవలు సమయానికి ప్రారంభించాలి తాండూరు ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి 

తాండూరు, అక్టోబర్ 16 ( తెలంగాణ వార్త ప్రతినిధి):

ప్రభుత్వ ఆస్పత్రులకు వైద్యం కోసం వచ్చే పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు, వారిపట్ల మానవత్వంతో వ్యవహరించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (బీఎంఆర్) వైద్యులు, వైద్య సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రి పేద ప్రజలకు దేవాలయం లాంటిదని, అక్కడ వైద్య సేవలు అందించే అవకాశం ఎంతో గొప్ప బాధ్యతతో కూడుకున్నదని పేర్కొన్నారు.

తాండూరు జిల్లా ఆస్పత్రి (డీహెచ్), మాతా శిశు ఆస్పత్రి (ఎంసీహెచ్) వైద్యులు, వైద్య సిబ్బందితో ఎమ్మెల్యే బీఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆస్పత్రుల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రోగులతో నేరుగా మాట్లాడి వైద్య సేవల నాణ్యత, ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీఎంఆర్ మాట్లాడుతూ.. ప్రజలు మొక్కేది ఇద్దరికేనని, ఒకరు దేవుడు కాగా మరొకరు వైద్యుడని అన్నారు. ‘వైద్యో నారాయణో హరి’ అన్న మాటకు అనుగుణంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి వైద్యుడు పునర్జన్మ ప్రసాదించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఎంతో కష్టపడి చదువుకుని వైద్యులుగా ఉన్నత స్థాయికి చేరుకున్న వారు తమ జ్ఞానాన్ని పేద ప్రజల సేవకు వినియోగించాలని పిలుపునిచ్చారు.

తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి మంచి పేరు, గుర్తింపు తీసుకువచ్చేలా వైద్యులు, వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని కోరారు. ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగికి సకాలంలో వైద్యం అందించడంతో పాటు, వారి పట్ల ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడాలని సూచించారు. రోగులతో వైద్యులు సానుకూలంగా మాట్లాడితే వారి ఆందోళన చాలావరకు తగ్గుతుందని, వైద్యంపై నమ్మకం పెరుగుతుందని తెలిపారు.

వైద్య వృత్తి కేవలం ఉద్యోగం మాత్రమే కాదని, అది ప్రజలకు సేవ చేసే గొప్ప బాధ్యత అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వైద్యులు, సిబ్బంది రోస్టర్ విధానాన్ని కచ్చితంగా పాటిస్తూ విధులు నిర్వహించాలని, ఓపీ సేవలను నిర్ణీత సమయానికి ప్రారంభించాలని ఆదేశించారు. వైద్యుల కోసం రోగులు ఎక్కువసేపు వేచి ఉండే పరిస్థితి రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

పేదలకు అందుబాటులో నాణ్యమైన వైద్యం.. అదే లక్ష్యం

ప్రభుత్వ ఆస్పత్రులపై పేద ప్రజలకు నమ్మకం మరింత పెరిగేలా వైద్య సేవలను మెరుగుపరచాలని ఎమ్మెల్యే బీఎంఆర్ సూచించారు. ప్రతి రోగికి గౌరవం, ఆప్యాయతతో కూడిన వైద్యం అందేలా వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్, రాజా మాలిక్, మేస్త్రి శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్, యాలల మండల అధ్యక్షులు మైపాల్, ప్రజాప్రతినిధులు, ఆర్‌ఎంలు, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.