ప్రజావాణి ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం..

వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా

తాండూర్, అక్టోబర్ 26 (తెలంగాణ వార్త ప్రతినిధి)వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజలకు పోలీస్ శాఖ మరింత చేరువ కావడంతో పాటు, తమ సమస్యలను నేరుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చే అవకాశం కలుగుతుందని తెలిపారు. ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును బాధ్యతగా పరిగణించి, పారదర్శకంగా విచారణ జరిపి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఫిర్యాదుదారులు తమ సమస్యలను నేరుగా జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకురాగా, ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించిసమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం జరగకూడదని, ప్రతి ఆర్జీపై తీసుకున్న చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.