తాండూరు ( 14th జులై 26) తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఎక్కడికో తరలిస్తున్నారంటూ కొంతకాలంగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు చేస్తున్న ప్రచారం పూర్తిగా నిరాధారమైనదని, అసత్య ప్రచారమని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రజల్లో భయాందోళనలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఎక్కడికీ తరలించే ప్రతిపాదన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.
ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా అవన్నీ వాస్తవాలు కావని, ప్రజలను తప్పుదోవ పట్టించడమే బీఆర్ఎస్ నాయకుల లక్ష్యంగా కనిపిస్తోందని నాగరాజు పేర్కొన్నారు.
ఇన్నాళ్లు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి, ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై స్పందించని బీఆర్ఎస్ నాయకులకు ఇప్పుడు అకస్మాత్తుగా ఆసుపత్రిపై ఇంత ప్రేమ ఎందుకు వచ్చిందో తాండూర్ ప్రజలు ఆలోచించాలని అన్నారు.
ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు అందిస్తున్న వినాయక ఏజెన్సీ ఉద్యోగులకు పీఎఫ్ నిధులు సక్రమంగా చెల్లించడం లేదని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఆ ఫిర్యాదులపై అధికారులు విచారణ నిర్వహించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం సదరు ఏజెన్సీ సేవలను నిలిపివేశారని పేర్కొన్నారు.
ఇది పూర్తిగా అధికారుల పరిపాలనా నిర్ణయమని, ఇందులో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని స్పష్టం చేశారు. సదరు ఏజెన్సీకి సంబంధించిన ఇతర అంశాలపై కూడా అధికారుల విచారణ కొనసాగుతోందని తెలిపారు.
ఈ నేపథ్యంలో కొందరు బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ ఆసుపత్రిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం, ఒత్తిడి రాజకీయాలకు పాల్పడటం సరైన పద్ధతి కాదని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా, చట్టబద్ధంగా పరిపాలన కొనసాగిస్తోందని, ప్రజల ఆరోగ్యం, ఉద్యోగుల హక్కులు, ప్రభుత్వ సేవల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని నాగరాజు స్పష్టం చేశారు.
తప్పు చేసిన వారిపై చట్టం తన పని తాను చేసుకుంటుందని తెలిపారు. ప్రజా సమస్యలపై మాట్లాడలేక, అభివృద్ధిని అడ్డుకోలేక ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిపై కూడా అసత్య ప్రచారాలు చేయడం బీఆర్ఎస్ నాయకులకు అలవాటుగా మారిందని విమర్శించారు.
తాండూర్ ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని, ఇకపై అసత్య ప్రచారాలను నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు.
ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలను బీఆర్ఎస్ నాయకులు వెంటనే విరమించుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టం చేస్తున్నామని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నాగరాజు తెలిపారు.
