అధిక ధరలకు ఎరువుల విక్రయాల పై ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆగ్రహం..!

తాండూరు, జూన్ 7: వర్షాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఫర్టిలైజర్ దుకాణాల్లో ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్నారనే విషయాన్ని ఆత్మ కమిటీ చైర్మన్ శంకర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.

ఈ అంశంపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి జిల్లా కలెక్టర్ దీపక్ తివారి మరియు జిల్లా వ్యవసాయ అధికారి (DAO)తో ఫోన్‌లో మాట్లాడారు. ఎరువుల ధరలు పెరగడంతో సన్న, చిన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ శాఖ అధికారులతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని సూచించారు. అలాగే అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్న డీలర్ల పై కఠిన చర్యలు తీసుకుని, అవసరమైతే వారి లైసెన్సులను రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు.

రైతుల ప్రయోజనాలను కాపాడటంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు..