పరిగి, జూన్ 3 : ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, అర్హత కలిగిన ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షించే బాధ్యత బూత్ లెవల్ ఏజెంట్ల (BLA)పై ఉందని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జాదవ్ ధారాసింగ్ నాయక్ పేర్కొన్నారు.
పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి అధ్యక్షతన పరిగి పట్టణంలోని ఎస్‌కే కన్వెన్షన్ హాల్‌లో పరిగి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో BLAలకు SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియపై అవగాహన శిక్షణ శిబిరం నిర్వహించారు.
ఈ సందర్భంగా ధారాసింగ్ నాయక్ మాట్లాడుతూ, ‘SIR’ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సంఘంతో కుమ్మక్కై కుట్రపూరితంగా సెక్యులర్ ఓటర్లను, ముఖ్యంగా ఆదివాసీ, గిరిజన, మైనారిటీ వర్గాల ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే ఇటువంటి చర్యలను అడ్డుకోవడానికి BLAలు అప్రమత్తంగా ఉండాలని, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ ప్రక్రియలో ఎటువంటి సమస్యలు ఎదురైనా పార్టీ నియమించిన బాధ్యులను సంప్రదించాలని కోరారు.
శిక్షణ శిబిరంలో TPCC ఎలక్షన్ కమిషన్ కో-ఆర్డినేషన్ చైర్మన్ రాజేష్, ట్రైనర్లు నరేశ్ రాథోడ్, రాజశేఖర్ రెడ్డి, మోహన్‌లు SIR ప్రక్రియపై 305 మంది BLAలకు సమగ్ర అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు భీంరెడ్డి, జనరల్ సెక్రటరీ దండు అశోక్, అధికార ప్రతినిధి ఆనంద్ గౌడ్, సెక్రటరీ రహీం పటేల్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ అక్బర్ హుస్సేన్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు , మున్సిపల్ చైర్‌పర్సన్ రజిత వెంకటేష్, AMC చైర్మన్లు ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
