తాండూరు, జూన్ 12: తాండూరు పట్టణంలోని సాయిపూర్ ప్రాంతంలో ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తూ భారీ షెడ్ నిర్మాణం జరుగుతుండటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పట్టణంలోని 9వ వార్డులో అంగన్వాడీ కేంద్రం, డ్వాక్రా భవనం పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలంలో ఈ నిర్మాణం కొనసాగుతోంది.
స్థానికుల సమాచారం ప్రకారం, నిర్మాణం జరుగుతున్న స్థలం పూర్తిగా ప్రభుత్వ భూమి. అయినప్పటికీ ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే భారీ షెడ్ నిర్మాణం చేపడుతున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మరింత వివాదాస్పదంగా, ఈ భూమి ప్రభుత్వానికి చెందినదేనని తెలిసినా, 9వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ దీప నర్సింహులు అండతోనే నిర్మాణం కొనసాగిస్తున్నానని సంబంధిత నిర్వాహకుడు బహిరంగంగా చెబుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉండగా, నిర్మాణ ప్రదేశంలో ఇటీవల ప్రభుత్వం తరఫున బోర్‌వెల్ తవ్వడం కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ భూమిలో జరుగుతున్న నిర్మాణం పై అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పై స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్న మున్సిపల్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ వ్యవహారం పై వెంటనే స్పందించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకుని ప్రభుత్వ భూమిని పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
