తాండూర్, తేదీ జూన్ 2 : ఓటరు జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ (Special Intensive Revision – SIR) కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు తాండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, న్యాయవాది కర్ణం పురుషోత్తం రావును తాండూర్ నియోజకవర్గ SIR కన్వీనర్‌గా నియమిస్తున్నట్లు తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రకటించారు.
భారత ఎన్నికల సంఘం (ECI) చేపడుతున్న ప్రత్యేక ముమ్మర సవరణ కార్యక్రమంలో భాగంగా వోటర్ మ్యాపింగ్ అత్యంత కీలకమైన ముందస్తు ప్రక్రియ అని ఎమ్మెల్యే తెలిపారు.
2002-2004 మధ్య జరిగిన చివరి SIR రికార్డులను ప్రస్తుత ఓటర్ల జాబితాలతో పోల్చి పరిశీలిస్తూ, ప్రతి ఓటరును వారి పాత రికార్డులు లేదా కుటుంబ మూలాలతో అనుసంధానించడం ఈ ప్రక్రియ ప్రధాన లక్ష్యమని వివరించారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు ఇప్పటికే తాండూర్ నియోజకవర్గ పరిధిలోని 269 పోలింగ్ బూత్‌లకు కాంగ్రెస్ పార్టీ తరఫున బూత్ లెవల్ ఏజెంట్లను (BLA) నియమించినట్లు ఆయన వెల్లడించారు. వారికి అవసరమైన మార్గదర్శకాలు, సూచనలు అందించడంతో పాటు SIR ప్రక్రియను సమర్థవంతంగా పర్యవేక్షించే బాధ్యతలను కర్ణం పురుషోత్తం రావుకు అప్పగించినట్లు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, BLAలు మరియు నాయకులు సమన్వయంతో పనిచేసి ప్రతి అర్హ ఓటరు వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా కృషి చేయాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు.
