డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కేటాయింపులో పూర్తి పారదర్శకత..!

వికారాబాద్, జూన్ 6 (తెలంగాణ వార్త):డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ స్పష్టం చేశారు. తాండూరు నియోజకవర్గంలో ఇండ్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ర్యాండమైజేషన్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.

శనివారం వికారాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో తాండూరు నియోజకవర్గంలోని డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల ఎంపిక ప్రక్రియపై నిర్వహించిన అవగాహన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ సమావేశానికి అదనపు కలెక్టర్లు కే. వెంకటాచారి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాథోడ్ దశరథ్ సింగ్, మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.

తాండూరు నియోజకవర్గంలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కోసం మొత్తం 8,333 దరఖాస్తులు అందాయని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం 581 ఇండ్లు కేటాయింపునకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.

ర్యాండమైజేషన్ ద్వారా ఎంపికైన లబ్ధిదారుల వివరాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించిన అనంతరం మాత్రమే ఇండ్ల కేటాయింపు జరుగుతుందని పేర్కొన్నారు. అర్హత లేని వ్యక్తులకు ఇండ్లు కేటాయించబడ్డాయని ఫిర్యాదులు వచ్చిన పక్షంలో వాటిని స్వీకరించి మళ్లీ విచారణ చేపడతామని హెచ్చరించారు.

డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కేటాయింపులో పారదర్శకత, న్యాయబద్ధతకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఈ సమీక్ష సమావేశంలో అడిషనల్ కలెక్టర్ లు,మునిసిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్ , హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాథోడ్ దశరథ సింగ్, మరియు కౌన్సిలర్లు పాల్గొన్నారు.