హైదరాబాద్, జూన్ 3 : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు పొరపాటుగా,ఆవేశపూరితంగా వచ్చినవేనని పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలను పార్టీ అధికారిక విధానంగా లేదా బీఆర్‌ఎస్ సిద్ధాంతంగా చూడవద్దని స్పష్టం చేశారు.
బీఆర్‌ఎస్ ఎల్లప్పుడూ ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ప్రజా సమస్యల పై పోరాటం చేస్తుందని, హింసాత్మక చర్యలను పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించదని కేటీఆర్ తెలిపారు. ప్రజల సమస్యల పై ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే క్రమంలో బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయని, వాటి వల్ల ఎవరైనా మనస్తాపానికి గురై ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నామని అన్నారు.
ప్రతిపక్ష నాయకుల పై కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం ద్వారా ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. రాజకీయ విభేదాలను ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే పరిష్కరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
బీఆర్‌ఎస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి ఉంటుందని కేటీఆర్ పునరుద్ఘాటించారు.
