ఘనంగా తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి జన్మదిన వేడుకలు..!

హైదరాబాద్ (మణికొండ) జూన్ 7 : తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లోని మణికొండ నివాసంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా తాండూరు నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

జన్మదిన వేడుకల్లో పైలెట్ రోహిత్ రెడ్డి తండ్రి, సీనియర్ నాయకుడు విఠల్ రెడ్డి, తాండూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ పంజుగుల శ్రీశైల్ రెడ్డి, వికారాబాద్ మాజీ జడ్పీటీసీ ప్రమోదిని, ఆర్తి రెడ్డి, రితేష్ రెడ్డి తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలుపగా, కేక్ కటింగ్ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.

మణికొండ నివాసం వద్ద ఉదయం నుంచే అభిమానులు, కార్యకర్తల రాకపోకలతో సందడి నెలకొంది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు పైలెట్ రోహిత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

అదే సమయంలో తాండూరులోని జిల్లా ఆస్పత్రిలో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా, పైలెట్ క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, తాండూరు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసిన పైలెట్ రోహిత్ రెడ్డి మరింత ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తాండూరు నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.