నూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియామకం..!

న్యూఢిల్లీ ( 26th జులై 2026) : దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థుల భారీ నిరసనలు, జంతర్ మంతర్ వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సమర్పించినట్లు ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం కేంద్ర విద్యాశాఖ బాధ్యతలను బీజేపీ సీనియర్ నేత ప్రహ్లాద్ జోషికి అప్పగించారు. ఆదివారం ఆయన అధికారికంగా కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

విద్యార్థుల ఆందోళనకు తెర..
జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టిన విద్యార్థి సంఘాల ప్రతినిధులతో కేంద్ర మంత్రులు జగత్ ప్రకాష్ నడ్డా, జితేంద్ర సింగ్ చర్చలు జరిపారు. విద్యార్థుల ప్రధాన డిమాండ్లపై సానుకూల నిర్ణయం రావడంతో ఆందోళనలను విరమిస్తున్నట్లు ప్రకటించారు.

కర్ణాటకలోని బీజాపూర్‌లో 1962 నవంబర్ 27న జన్మించిన ప్రహ్లాద్ జోషి, హుబ్బళ్లిలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. రాజకీయాల్లోకి రాకముందు వ్యాపార రంగంలో అనుభవం సంపాదించిన ఆయన, కర్ణాటకలో బీజేపీ కీలక నాయకుడిగా ఎదిగారు.

2004 నుంచి ధార్వాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు ఎంపీగా ఎన్నికైన ప్రహ్లాద్ జోషి, గతంలో పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖల మంత్రిగా సేవలందించారు. 2024 ఎన్నికల అనంతరం వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ, నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖలను కూడా నిర్వహించారు.

కీలక పథకాల అమలులో పాత్ర..
నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన వంటి ప్రతిష్టాత్మక పథకాల అమలులో ప్రహ్లాద్ జోషి కీలక పాత్ర పోషించారు.