హైదరాబాద్: తాండూరు నియోజకవర్గానికి కీలకమైన షాబాద్ స్టోన్ పరిశ్రమతో పాటు ఆటోమొబైల్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
తాండూరు ప్రాంతంలో ఈ రంగాలపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులు, వ్యాపారులు, పరిశ్రమల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు. పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ సహకారం అందించడంతో పాటు స్థానికంగా మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం ఎమ్మెల్యే లేవనెత్తిన అంశాలపై మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించారు. షాబాద్ స్టోన్ పరిశ్రమతో పాటు ఆటోమొబైల్ రంగం అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని, ఈ రంగాలపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులు, వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు.
తాండూరు ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి, స్థానికంగా ఉపాధి అవకాశాల పెంపునకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.
