అక్రమ నిర్బంధాలతో పోరాటం ఆగదు..ప్రభుత్వానికి BRSV హెచ్చరిక.!

తాండూర్: అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో తాండూర్‌లో BRSV నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి నిర్బంధించడాన్ని BRSV జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ రావు తీవ్రంగా ఖండించారు. గురువారం ఉదయం పలువురు BRSV నాయకులు, కార్యకర్తలను పోలీసులు ప్రివెంటివ్ అరెస్టులు చేసినట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా దత్తాత్రేయ రావు మాట్లాడుతూ.. తమ నాయకుడి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకరయ్యను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో ముందుగానే BRSV నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ నిర్బంధించడం ప్రభుత్వానికి సిగ్గుచేటని విమర్శించారు.

ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున ప్రశ్నించే గొంతులను అణచివేయడం సరికాదని ఆయన అన్నారు. అక్రమ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులతో తమ పోరాటాన్ని ఆపలేరని స్పష్టం చేశారు.

అణచివేతలు ఎంత పెరిగినా ప్రజల తరఫున మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ప్రజాస్వామ్య హక్కులను కాపాడే వరకు మా ఉద్యమం ఆగదు అని దత్తాత్రేయ రావు పేర్కొన్నారు.

ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు విధించినా ప్రజా సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని ఆయన హెచ్చరించారు.