తాండూరు ( సెప్టెంబర్ 8th 2026) : తెలంగాణ శాసనసభ గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ తాండూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
తాండూరు మండలం గౌతాపూర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తాతా మధు దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, చట్టసభలకు సభాధిపతిగా ఉన్న గౌరవ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలను అవమానించడమేనని అన్నారు. ఒక దళిత నాయకుడు ఉన్నతమైన స్పీకర్ పదవిలో కొనసాగడాన్ని ఓర్వలేకే బీఆర్‌ఎస్ నాయకులు ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.
తాతా మధు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆయన వెంటనే గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు, తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తాండూరు మండల కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
