తాండూర్ ( సెప్టెంబర్ 6th 2026 ) : ప్రశాంతంగా ఉన్న తాండూర్ పట్టణంలో రోహిత్ రెడ్డి వ్యవహారశైలి రోజురోజుకూ వివాదాలకు దారితీస్తోందని తాండూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బాతుల నాగరాజ్ విమర్శించారు.
రోహిత్ రెడ్డి పేరును గతంలో వివాదాలకు సంబంధించిన పలు అంశాల్లో ప్రస్తావించారని, దుబాయ్ మర్డర్ వ్యవహారం, ఫాంహౌస్ డ్రగ్స్ ఆరోపణలు, పబ్‌లో సినీ తారతో జరిగినట్లు ప్రచారంలో ఉన్న వివాదం వంటి అంశాలపై ఆయనపై విమర్శలు వచ్చాయని నాగరాజ్ పేర్కొన్నారు.
తాజాగా తాండూర్‌లో తన దుకాణం ప్రారంభించిన అనంతరం కార్యకర్తలను రెచ్చగొట్టి గొడవలకు ప్రేరేపించడం ఏ తరహా రాజకీయమని ఆయన ప్రశ్నించారు. కార్యకర్తను ఫోన్‌లో రెచ్చగొట్టి గొడవకు రావాలని చెప్పి.. సమస్య తలెత్తిన తర్వాత కనిపించకుండా పోవడం ఇదేనా మీ రాజకీయ నాయకత్వం.? అంటూ నిలదీశారు.
కార్యకర్తలను ముందుకు నెట్టి, సమస్య వచ్చినప్పుడు నాయకులు వెనక్కి తగ్గడం బాధ్యతాయుతమైన నాయకత్వం కాదని నాగరాజ్ అన్నారు. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం కార్యకర్తల మధ్య చిచ్చుపెట్టి తాండూర్‌లో ఉద్రిక్త వాతావరణం సృష్టించే ప్రయత్నాలను ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు సహించరని స్పష్టం చేశారు.
తాండూర్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రాజకీయాలకు స్వస్తి చెప్పాలని, బాధ్యతాయుతమైన రాజకీయాలు చేయాలని రోహిత్ రెడ్డికి బాతుల నాగరాజ్ సూచించారు.
