దివ్యాంగ ఇంటర్‌ విద్యార్థులకు స్కూటీలు..!

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 30:( తెలంగాణ వార్త ప్రతినిధి) : దివ్యాంగ విద్యార్థులు ఇంటర్‌ విద్యను కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు మూడు చక్రాల స్కూటీలను అందించాలని నిర్ణయించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం (2026-27)లో వెయ్యి మంది విద్యార్థులకు స్కూటీలు అందించేందుకు రూ.10 కోట్లను కేటాయించింది.

శారీరక వైకల్యం కారణంగా పలువురు విద్యార్థులు పదో తరగతి తర్వాత చదువును మధ్యలోనే నిలిపివేస్తున్నారు. ఇంటర్‌లో చేరిన వారు కూడా కళాశాలకు వెళ్లేందుకు బస్సులను ఆశ్రయించాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన ఇంటర్‌ విద్యాశాఖ దివ్యాంగ విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించేందుకు స్కూటీలను అందించాలని నిర్ణయించింది.

బస్సుల ఇబ్బందులకు చెక్‌

విద్యార్థులకు అందించనున్న స్కూటీలు మూడు చక్రాలతో కూడిన రెట్రోఫిట్టెడ్‌ మోటరైజ్డ్‌ వెహికల్స్‌. ఇవి పెట్రోల్‌తో పాటు విద్యుత్‌తోనూ నడిచే విధంగా ఉంటాయి. వీటి ద్వారా విద్యార్థులు సొంతంగా కళాశాలకు రాకపోకలు సాగించే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం ఒక్కో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సగటున ఒకరిద్దరు దివ్యాంగ విద్యార్థులు మాత్రమే చదువుతున్నట్లు తెలుస్తోంది. స్కూటీలను అందించడం ద్వారా రవాణా సమస్యలు తొలగి, మరింత మంది దివ్యాంగ విద్యార్థులు ఇంటర్‌ విద్యలో చేరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

అర్హులు వీరే..

రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ చదువుతున్న దివ్యాంగ విద్యార్థులు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా ఉండనున్నారు. అర్హులైన విద్యార్థులను గుర్తించి స్కూటీల పంపిణీ ప్రక్రియను చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.